త్వరలో ఆసరా పింఛన్లు!
- అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలక నిర్ణయం?
- చేయూత పెంపు ప్రతిపాదనపై కసరత్తు
- ఆగస్టు 2022 నుంచి కొత్త పెన్షన్లు లేవు
- ఇప్పటికే లక్షకు పైగా దరఖాస్తులు
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని మిగిలిన రైతు భరోసా, ఆసరా పెన్షన్లపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆసరా పెన్షన్ల అమలులో జాప్యం జరగడంతో వృద్ధుల నుంచి కొంతమేర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం.
గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.4 వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేసేవారు. 2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు, రూ.4 వేల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపర్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా పెన్షన్ల పెంపు జరుగకపోవడంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి నెలకొన్నట్టు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఆసరా పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నది.
దీంతోపాటు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో పెన్షన్‌దారుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొత్త ఏడాది నుంచి పెంచిన పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేలా కసరత్తు చేస్తున్నది.
దరఖాస్తులు పెండింగ్
వాస్తవానికి పెన్షనర్ల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి అవలంభించిందన్నది వాస్తవం. ఆగస్టు 2022 నుంచి ఒక్క కొత్త పెన్షన్‌కు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో పెన్షన్‌లకు అర్హత సాధించిన వేలాది మంది దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఏడాదిన్నర కాలంలో సుమారు 50 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనూ మరో 50 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పెన్షన్ పొందేవారికి అందించే మొత్తాన్ని పెంచకపోగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులతోపాటు పెన్షన్‌కు అర్హత ఉన్నవారు కూడా అసంతృప్తి చెందుతున్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్లు పెంచడంతోపాటు కొత్త పెన్షన్లు ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పటికీ నిధుల కొరత కూడా ఒక సమస్యగా మారినట్టు తెలుస్తోంది.
12 వేల కోట్లకుపైగా అదనపు భారం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా.. వివిధ కేటగిరిల వారీగా మొత్తం 43,68,784 మంది పెన్షన్‌దారులున్నారు. వీరందరికీ పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల వరకు కేటాయిస్తున్నది. ఈ లెక్కన ఒక ఆర్థిక సంవత్సరంలో పెన్షన్‌ల కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నది.
హామీలో భాగంగా ఉన్నఫలంగా పెన్షన్ పెంచితే రాష్ట్ర ప్రభుత్వంపై రెట్టింపు భారం పడే అవకాశం ఉంది. రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు, రూ.4వేల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచితే ప్రతి ఏటా రూ. 24 వేల కోట్లు అవసరం అవుతాయి. పెన్షన్ పెంపునకు సంబంధించిన రూ.24 వేల కోట్ల ప్రతిపాదనలను సంబంధిత శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం.
ఇప్పటివరకు ఉన్న పెన్షన్లను యథావిధిగా అమలు చేయడంతోపాటు దరఖాస్తు చేసుకుని పెండింగ్‌లో ఉన్నవారు, కొత్త పెన్షన్‌కు అర్హత సాధించిన వారు కూడా జాబితాలో చేరతారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్ పథకం కోసం ప్రభుత్వం వెచ్చించే నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసరా పెన్షన్ అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్యాటగిరీల వారీగా పింఛన్‌దారులు
వృద్ధులు 15,81,630
వితంతువులు 15,54,525
దివ్యాంగులు 5,05,836
బీడీ కార్మికులు 4,24,292
ఒంటరి మహిళలు 1,42,252
గీత కార్మికులు 65,196
నేత కార్మికులు 37,051
ఎయిడ్స్ రోగులు 35,670
బోదకాలు బాధితులు 17,995
డయాలిసిస్ రోగులు 4,337
మొత్తం 43,68,784






