04-05-2024 12:37:28 AM
12 రాష్ట్రాల్లో మూడో విడత ఎన్నికలు
న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. దేశ భవిష్యత్తును, రాజకీయ నేతల తల రాతను మార్చే ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి. మూడో విడత పోలింగ్ మే 7వ తేదీన జరగనున్నాయి. ఈ విడత ఎన్నికల్లో 12 రాష్ట్రాల్లో 94 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. గోవాలోని రెండు స్థానాలకు, కర్ణాటకలో మిగిలిన 14 లోక్‌సభ స్థానాలకు ఎంపీలను ఈ విడతలో ఓటర్లు ఎన్నుకోనున్నారు. రెండో విడతలో జరగాల్సి ఉండగా.. బీజేపీ అభ్యర్థి మరణంతో వాయిదా పడిన బేతూల్ స్థానానికి ఈ సారి ఎన్నిక జరగనుంది.అస్సాంలోని నాలుగు స్థానాలు, బీహార్లోని 5 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 7 స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని 8 స్థానాలకు, మహారాష్ట్రలోని 11 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు స్థానాలకు, దాద్రా నగర్ హవేలీలో, జమ్ము కశ్మీర్‌లో ఒక స్థానానికి మూడో విడతలో పోలింగ్ జరగనుంది.