19-05-2025 08:54:55 PM
పుట్ట మధు వాఖ్యలపై కాంగ్రెస్ నేతలు..
కాటారం (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(MP Vamsi Krishna) ప్రోటోకాల్ అంశంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు టిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ధన్వాడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి అశోక్, ఆత్మకూరి కుమార్ యాదవ్, బిరెల్లి మహేష్ తదితరులు అన్నారు. కాటారం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ సమ్మయ్యతో పాటు వారు మాట్లాడారు.
వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయంలో ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పుష్కర ఉత్సవాల్లో టెండర్ తీసుకున్న సంస్థలు ఫ్లెక్సీలలో ఫోటోలు ఏర్పాటు చేయకపోతే మంత్రి శ్రీధర్ బాబును, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని మాట్లాడే పుట్ట మధుకర్ టిఆర్ఎస్ పాలనలో దళిత జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని ప్రోటోకాల్ విషయంలో ఎందుకు పట్టించుకోలేదని వారు ప్రశ్నించారు.
భూపాలపల్లి నియోజకవర్గ ఆరు మండలాలలో కనీసం ప్రోటోకాల్, ఫోటో, క్యాంప్ ఆఫీస్ లేకుండా చేసిన మీ నాయకులను ఎందుకు ప్రశ్నించలేదని వారు అన్నారు. న్యాయవాదులైన వామన్ రావు దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసి పోలీసులు అరెస్టు చేస్తారని పారిపోయిన నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. నామినేటెడ్ పదవుల్లో దళితులకు, గిరిజనులకు ఇవ్వకపోగా అడిగినందుకు మహ ముత్తారం గిరిజన నాయకునిపై దాడి చేసింది నిజం కాదా అని అడుగుతున్నామనీ పేర్కొన్నారు.
మంథని నియోజకవర్గంలో కవిరాజు, మంథని మధుకర్, రేవెల్లి రాజబాబు, లింగయ్య, లాంటి అనేకమంది దళిత గిరిజన ఆదివాసీల మీద అరాచకాలు జరిగినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని వారు ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీపై ప్రేమ ఎందుకో తెలపాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల రక్తం, చెమట చుక్కలతో గెలిచిన ఎంపీ ఏ ఒక్కరోజు సామాన్యులకు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకున్నా, కాక వెంకట స్వామి పై ఉన్న గౌరవంతో, అభిమానించుకుంటున్నామన్నారు. తాము కట్టే ప్రతి ఫ్లెక్సీలో, ప్రతి కార్యక్రమంలో ఎంపీ వంశీ పేరు పెట్టి, ఫోటో పెట్టి గౌరవించుకుంటున్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, పదవి పోయినంక గుర్తుకు వస్తుందా అని వారు ప్రశ్నించారు.