calender_icon.png 13 December, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పోలవరం-నల్లమలసాగర్’పై సుప్రీంకోర్టుకు

13-12-2025 12:33:47 AM

  1. అభ్యంతరాలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  2. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సింగ్వీ వాదనలు
  3. సింగ్వీతో నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి) : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో ముగిసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం మరో సారి చర్చనీయాంశంగా మారింది. తాజా గా ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును చేపడుతుండటంతో సాగునీటి వివాదం మళ్లీ ముదురుతోంది. పోలవరం డ్యాం రివైజ్డ్ పర్మిషన్ ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల్లసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజె క్టులపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తంచేసింది.

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అధికారికంగా అభ్యంతరాలు దాఖ లు చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో తెలంగాణ తరఫున వాదించేందుకు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్వీని కోరింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో దీనిపై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. 

ఏపీ ప్రాజెక్టులపై ఆగ్రహం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు నిర్మా ణం ద్వారా భారీగా నీటిని లిఫ్ట్ చేసి సమీ ప ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాలపై తీవ్రమైన ప్రభావం పడనున్నది. తద్వారా కృష్ణా నదిలో వాటా కింద తెలంగాణ లభించాల్సిన నీటి పరిమాణం తగ్గే ప్ర మాదం ఉంది. అందుకే ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. వాస్తవానికి ఈ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్‌గా యూఎన్ ప్రకటించింది.

కానీ ప్రాజెక్టు కారణంగా నల్లమల అడవులపై పర్యావరణ ప్రభా వం తీవ్రంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ ఆరోపిస్తున్నది. పోలవరం రీవైజ్డ్ అంచనా వ్యయా లు, డ్యాం సేఫ్టీ అనుమతులు, కట్-ఆఫ్ వాల్యూ లెక్కింపు మొదలైన అంశాల్లో తెలంగాణ ప్రమే యం లేకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తమ చేస్తున్నది.

ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా నదిలోని నీటి కేటాయింపులను ఉల్లంఘిస్తున్నాయని, సీడబ్ల్యూసీ క్లియరెన్స్ లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించడాన్ని తెలంగాణ ప్రశ్నిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు కారణంగా హైదరాబాద్ తాగునీటి పర్యావరణ వ్యవస్థపై ప్రభావం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలు, 2014 విభజన నిబంధనలు, కృష్ణా బోర్డు అనుమతులను ఏపీ పాటించలేదని తెలంగాణ వాదిస్తున్నది. 

సుప్రీంకోర్టుకు తెలంగాణ..

పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నది. ఇందులో భాగంగా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్వీ తెలంగాణ తరఫున వాదించేందుకు అంగీకరించారు. ఈ కేసు నేషనల్ ఇంపాక్ట్ ఉన్న వివాదం కావడంతో సుప్రీం కోర్టులో బలమైన లీగల్ రిప్రజెంటేషన్ అవసరం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తదుపరి కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునేందుకు శనివారం ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, న్యాయ బృందం, సాగునీటి, పర్యావరణ నిపుణులతో చర్చించ నున్నారు. ఏపీ ప్రాజెక్టుల డీపీఆర్, మ్యాప్‌లు, శాటిలైట్ డేటా, నీటి వినియోగం లెక్కలపై సమీక్షించనున్నారని సమా చారం. సింగ్వీతో సమావేశంలో భాగంగా పిటిషన్ డ్రాఫ్ట్, ఏ సెక్షన్ల కింద సవాలు చేయాలి, ఏపీ చేపట్టిన చట్ట విరుద్ధమైన చర్యలను నిరూపించడం, మధ్యంతర స్టే కోరడం వంటి అంశాలపై కీలకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.