23-08-2025 05:36:59 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ బాశెట్టి గంగారం విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో శనివారం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట్ స్వామి, బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా, కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించారనీ తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులై, విద్యార్థి నాయకుడిగా ఎదిగాడన్నారు.
సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో చరిత్రలో బీ.ఏ (1964) హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ (1967) పూర్తి చేశారని తెలిపారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998 2004 ఎన్నికలలో ఎంపీగా విజయం సాధించారన్నారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు దఫాలు పనిచేశారనీ, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజలకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజేష్, డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు రాజం, శంకర్, ప్రశాంత్, రాజేందర్, రాజమల్లు పాల్గొన్నారు.