14-05-2025 12:00:00 AM
- అందని ప్రధానమంత్రి స్వనిధి రుణాలు
- మూడు నెలలుగా పనిచేయని సైట్
- వీధి వ్యాపారుల్లో నిరాశ
మెదక్, మే 13(విజయక్రాంతి):పట్టణ ప్రాంతాలలో చిరు, వీధి వ్యాపారులకు అం దించే ప్రధానమంత్రి స్వనిధి (ఆత్మనిర్భర్ నిధి) రుణాల ప్రక్రియలో ప్రధాన భూమిక పోషించే సైట్ మూడు నెలలుగా పని చేయ డం లేదు. దీంతో స్వనిధి రుణాలు అందడంలేదు. తొలి, మలి దశ రుణాల కోసం ఎదురు చూస్తున్న వీధివ్యాపారులు కొంత నిరాశకు గురవుతున్నారు.
మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించే వీధివ్యాపారులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. 2020లో కరోనా లాక్ డౌన్ నుంచి ఆత్మనిర్బర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద గుర్తించిన వీధి వ్యాపారులకు మొదటి విడతలో లబ్దిదారుడికి రూ.10 వేల రుణం అందజేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకు ల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం అందజేసే ఈ మొత్తం వారి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడేది.
రుణం కోసం ఎదురుచూపులు..
ఐదేళ్ల కిందట ప్రతి వీధి వ్యాపారికి రూ.10 వేలు ఖాతాలో జమ చేయగా ఈ మొత్తాన్ని ఏడాదిలోపు వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన వారికి మళ్లీ రుణం తీసుకోవడానికి వీలు కలిగేది. రెండో విడతలో రూ.20 వేలు అందించగా మూడో విడతలో దానిని రూ. 50 వేలకు పెంచారు. రుణం మొత్తం పెరుగుతూ ఉండ టం, వ్యాపారాభివృద్ధికి తోడుగా నిలవడంతో లబ్దిదారులు రుణం తీసుకోవడానికి మళ్లీమళ్లీ ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకర్లు సైతం ఈ రుణాలు సక్రమంగా చెల్లించినవారికి అందించేందుకు ముందుకొ చ్చారు. అయితే గత మూడు నెలలుగా రుణాలు అందించడంలేదు. దీంతో వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రుణాన్ని రూ.లక్షకు పెంచితే..
ఆత్మనిర్భర్ నిధి పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని విధించి మరీ రుణాలు అందిస్తుండగా ఇటీవల కొత్త పథకం అమలు చేసేందుకు వీలుగా సాంకేతికపరంగా ఆప్షన్ ఇవ్వక పోవడంతో పాతవారితో పాటు కొత్త వారికి కూడా రుణాలు అందించేందుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
కొత్త పథకం అమలు చేసేంత వరకు పీఎం స్వనిధి పథకం నిలిచిపోయినట్లుగానే భావిస్తున్నారు. అయితే వీధి వ్యాపారులకు రూ. 50 వేల వరకు ఇస్తున్న రుణాన్ని చెల్లించిన వారికి దానిని రూ.లక్షకు పెంచాలని పలువురు కోరు తున్నారు. దీంతో ఆర్థిక అవస రాలు తీరడంతో పాటు ఉపాధి పెరిగి జీవన ప్రమాణాలు మరింత పెరగనున్నాయని పలువురు భావిస్తున్నారు.
నాలుగు మున్సిపాలిటీల్లో...
మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం సుమారుగా పది వేల మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వారిలో తొలి విడతలో రూ.10 వేల రుణం పొందిన వారు సుమారు పది వేల వరకు ఉండగా రెండవ విడతలో రూ.20 వేల రుణం పొందిన వారు ఐదు వేలలోపు ఉన్నారు. మూడవ విడతలో రూ. 50 వేల రుణం పొందిన వారు కేవలం 1500 మంది ఉన్నారని సమాచారం. మూడవ విడత రుణం సక్రమంగా చెల్లించిన వారు ఈసారి రూ. లక్ష రుణం అందజేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.