05-01-2025 01:08:30 AM
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 141/6
పంత్ మెరుపు అర్థసెంచరీ
ఆస్ట్రేలియా 181 ఆలౌట్
145 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
సిడ్నీ: బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిడ్నీ టెస్టు రసవత్తరంగా మారింది. బౌలింగ్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిన వేళ రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
రవీంద్ర జడేజా (8), సుందర్ (6) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో నేడు కీలకం కానుం ది. సిడ్నీ టెస్టులో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని గత రికార్డులు చెబుతున్నాయి. తొమ్మిది సందర్భాలో ఛేదనలో ఏడుసార్లు ఓటములు పలకరించగా..ఒక్కసారి మాత్రమే విజయం దక్కింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది.
భారత్ తరఫున ఒక బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా (5 టెస్టుల్లో 32 వికెట్లు) నిలిచాడు. తద్వారా స్పిన్నర్ బిషన్ సింగ్ (31 వికెట్లు) 47 ఏళ్ల రికార్డును బుమ్రా బద్దలుకొట్టాడు.
బుమ్రాకు గాయం
సిడ్నీ టెస్టులో భారత జట్టును నడిపిస్తున్న స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి బారిన పడ్డాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సమయంలో లంచ్ అనంతరం ఒక్క ఓవర్ బౌలింగ్ వేసిన బుమ్రా నొప్పిని తట్టుకోలేక పెవిలియన్ చేరాడు. దీంతో కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా బుమ్రా గాయంపై ప్రసిధ్ క్రిష్ణ అప్‌డేట్ ఇచ్చాడు. ‘బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య బృందం అతడి పరిస్థిని పర్యవేక్షిస్తోంది. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బుమ్రా విషయంలో స్పష్టత రానుంది’ అని ప్రసిధ్ పేర్కొన్నాడు.