26-11-2025 12:00:00 AM
-బరిలో స్టార్ ప్లేయర్స్
-యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్
అహ్మదాబాద్, నవంబర్ 25 : దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ టీ20 టోర్నీగా పేరున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బుధవారం నుంచి మొదలుకాబోతోంది. డిసెంబర్ 18 వరకూ జరిగే ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీ చరిత్రలో ఇది 18వ ఎడిషన్. ఈ సారి పలువురు స్టార్ ప్లేయర్స్ బరిలో దిగుతున్నారు. భారత టీ ట్వంటీ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్, కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన శివమ్ దూబే , మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, పృథ్వీ షా వంటి స్టార్ ప్లేయర్స్ ఈ దేశవాళీ టోర్నీలో తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సౌతాఫ్రికాతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ఉండడంతో ప్రిపరేషన్ కోసం ఈ టోర్నీ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఐపీఎల్ మినీ వేలం ఉండడంతో ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు ఈ టోర్నీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఆంధ్రా జట్టు ఎలైట్ ఏ గ్రూపులో ఉండగా..హైదరాబాద్ ఎలైట్ బి గ్రూపులో చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లోని 12 వేదికలు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ జట్టులో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్స్‌కు ఈ టోర్నీ గోల్డెన్ ఛాన్స్‌గా చెబుతున్నారు.