17-01-2026 02:53:48 AM
వ్యవసాయ కుటుంబాల నుంచి ఉద్యోగాలకు
హాజీపూర్, జనవరి 16 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్సీ) ద్వారా నిర్వహించిన జీడీ కానిస్టేబుల్ నియామక పరీక్షా ఫలితాల్లో మండల యువకులు ప్రతిభ కనబర్చారు. 2024 సంవత్సరానికి గాను ఎస్‌ఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, 2025 మార్చిలో అభ్యర్థులు రాత పరీక్షలు రాశారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి గురువారం సాయంత్రం ఎస్‌ఎస్సీ అధికారులు ఫలితాలను ప్రకటించగా, వ్యవసాయ కుటుంబా లకు చెందిన హాజీపూర్ మండల యువకులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్ తదితర కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
మండలం నుంచి ముగ్గురు ఎంపిక...
కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాలకు హాజీపూర్ మండలం నుంచి ముగ్గురు యువకులు ఎంపికయ్యారు. దొనబండ గ్రామానికి చెందిన గొర్రె దేవయ్య, ఉమారాణి దంపతుల కుమారుడు గొర్రె అఖిల్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపిక కాగా పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన చింతకింది రాజేశ్వరి, రాజయ్య దంపతుల కుమారుడు రమేష్ సైతం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా, పెద్దంపేట గ్రామానికి చెందిన లక్ష్మీ, శ్రీనివాస్‌ల కుమారుడు మొగిలి రాజ్ కుమార్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన యువకులను పెద్దంపేట, దొనబండ గ్రామాల సర్పంచులు జాడి వెంకటేష్, బేతు రమాదేవి రవిలతో పాటు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అభినందించారు.