calender_icon.png 17 January, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా మహా పూజలకు శ్రీకారం

17-01-2026 03:27:18 AM

  1. కాగడాలను వెలిగించిన ఆలయ పీఠాధిపతి
  2. మర్రి చెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశ పటేల్లు  
  3. మరణించిన వంశీయులకు ‘తూమ్’ పూజలు 

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 16 (విజయక్రాంతి): రాజు వెడలే రాజ దర్బార్ ... అనే విధంగా నాగోబా దేవుడి మహా పూజలకు  ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావుతో పాటు మెస్రం వంశ పటేల్లు గురువారం రాత్రి మర్రి చెట్ల వద్దకు బయలుదేరారు. ఆలయ పీఠాధిపతి ఇంటి నుంచి మర్రి చెట్ల వద్దకు ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయంగా వాయించే డోలు, సన్నాయిలు, కలికొమ్ తో కొత్వాల్ మెస్రం తిరుపతి ఆధ్వర్యంలో పర్దాలు తీసుకువెళ్లారు. నాగోబా మహాపూజలకు సందర్భంగా వెలిగించే కాగడాలను ఆలయ పీఠాధిపతి మె స్రం వెంకట్రావు వెలిగించి మహా పూజలకు శ్రీకారం చుట్టారు.

మర్రి చెట్ల వద్దకు మెస్రం వంశం పటేళ్లు ప్రవేశం చేయగానే.. మెస్రం వం శంలోని 21 తెగల మెస్రం వంశస్థులు వారికి స్వాగతం పలికారు. నాగోబా మహా పూజలకు  ముందు మర్రి చెట్ల వద్ద నిర్వహించే సాంప్రదాయ పూజలతో పాటు ఈనెల 18న నాగోబా దేవుడికి నిర్వహించే మహా పూజ, పవిత్ర గంగా జలంతో అభిషేకంపై ఆలయ పీఠాధిపతి వెంకట్రావు తో చర్చించారు.

మర్రి చెట్ల నీడలో సేద తీరుతున్న మెస్రం వంశీయులు 

దేశంలోని ఆదివాసీ గిరిజనులు జరుపుకునే జాతరలో రెండవ జాతరగా పేరు పొందిన రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన నాగోబా జాతరకు  మెస్రం వంశీయులు తరలివచ్చి నాగోబా ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్ల వద్ద సేద తీరుతున్నారు.ఈనెల 18న నాగోబా కు మహాపూజ లు నిర్వహించేందుకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడు గు గ్రామ సమీపంలోని గోదావరిలోని హస్తనామడుగు నుండి సేకరించిన పవిత్ర గంగా జలా న్ని మెస్రం వంశీయులు తీసుకొని మర్రిచెట్టు వద్దకు చేరుకున్నారు.ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, ఒడిస్సా నివాసముండే మెస్రం వంశీయులు కుటుంబాలతో చేరుకున్నారు. ఏడాదికి ఒకసారి నాగోబా సన్నిధిలో కలుసుకునే మెస్రం వంశీయులు తన యోగ సమాచారాలను, కష్ట సుఖాలను మర్రిచెట్టు నీడలో పంచుకున్నారు.

మర్రి చెట్టు నీడలో ‘తూమ్’ పూజలు  

మెస్రం వంశీయులలో మరణించిన చెందిన పెద్దలకు మర్రి చెట్టు నీడలో ‘తూమ్’ పూజలు నిర్వహించారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదా యం, ఆచార వ్యవహారాల ప్రకారంగా మెస్రం వంశీయులలో మరణించిన వారికి కర్మకాండలు గోండి భాషలో ‘తూమ్’ పూజలు అని అంటారు. ఈ పూజలు చేస్తేనే దైవ దర్శనం చేసుకునేందుకు కుటుంబానికి వీలుంటుందని మె స్రం వంశ పెద్దలు తెలిపారు.