calender_icon.png 17 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న జల వివాదాల కమిటీ తొలి సమావేశం

17-01-2026 03:21:27 AM

  1. తెలంగాణ, ఏపీ మధ్య సాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యం
  2. గోదావరి-కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టులు, సాగునీటి అవసరాలే ప్రధాన ఎజెండా

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త జల వివాదాల కమిటీ తొలి సమావేశం ఈ నెల 30న న్యూఢిల్లీలో జరగనుంది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు. గోదావరి--కృష్ణా నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్వహణ, వినియోగ హక్కులు, ప్రస్తుత వివాదాస్పద అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు.

పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తంగా మారిన పరిస్థితులను చల్లబరచి, సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా కార్యాచరణ రూపొందించడమే కమిటీ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులు, వరద నిర్వహణ, సాగునీటి అవసరాలు వంటి అంశాలు అజెండాలో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. తొలి సమావేశంలోనే వివాదాల పరిష్కారానికి ప్రాథమిక మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని దఫాలు చర్చలు నిర్వహించి, ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక పరిష్కారాన్ని సాధించేందుకు కేంద్రం కృషి చేయనుంది.

15 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈనెల 2న కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీ కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు కాగా.. దీనికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యానాథ్ దాస్‌తోపాటు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఏపీ నుంచి ఆ రాష్ర్ట జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహామూర్తి, అంతర్రాష్ర్ట జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది.

అంతేకాకుండా.. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్ బిశ్వాస్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) సీఈ దాస్, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రయిజల్ ఆర్గనైజేషన్(పీఏవో) సీఈ పైథాంకర్‌ను కేంద్రం నుంచి సభ్యులుగా ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ క్రమంలో కమిటీ నేతృత్వంలో ఈనెల 30న కీలక భేటీ జరగనుంది. కమిటీ సభ్య కార్యదర్శిగా కేంద్ర జల కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ రాకేశ్ కుమార్ వ్యవహరించనున్నారు.