calender_icon.png 17 January, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పాపం బీఆర్‌ఎస్‌దే

17-01-2026 02:44:36 AM

  1.  పదేళ్లుగా ప్రాజెక్టులు పెండింగ్‌లో..
  2. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహట్టితో సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
  3. బాసర ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు 
  4. ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్ట్ 
  5. ఉమ్మడి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
  6. సదర్మట్, చనాకా కొరాటా బరాజ్‌లను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి  

నిర్మల్, జనవరి 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పాపం కారణంగానే ప్రాజెక్టులు పెండిం గ్‌లో ఉన్నాయని, వాటికి నిధులు ఇచ్చి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాసరలోని ట్రిపుల్ ఐటీలో యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తానని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే అదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామం వద్ద రూ. 529.20 కోట్లతో నిర్మించిన సదర్మట్ బరాజ్‌ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు.

అంతకుముందు భోరజ్ మండలం హత్తీఘాట్ గ్రామంలో పెన్ గంగా నది ఒడ్డున నిర్మించిన చనాకా -కొరాటా బరాజ్ పంప్ హౌస్‌ను ప్రారం భించారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో.. 326 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రామాయణంలో మారీచుడు,  సుబాహువు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారని, యజ్ఞయాగాలు భంగం చేసేందుకు వారి గురువుగారి ఆదేశం మేరకు ప్రజలను పీడించేవారని, అలాగే.. ఫాంహౌస్‌లో వున్న కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి వస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించగా 10 ఏళ్ల తర్వాత, పెండింగ్ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గోదావరి జలాలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరి జలాలను ప్రతి ఎకరానికి మళ్ళించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహట్టి వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపొందించిన ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించడంతో ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాష్ట్రనికి కేటాయించిన గోదావరి, కృష్ణా బేసిన్లలో ఒక్క చుక్క వదులుకోబోమని స్పష్టంచేశారు . తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు.  వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందని తెలిపారు. 27, 28 కాళేశ్వరం ప్యాకేజీ పెండింగ్ పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు. గత పాలకులు ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు అన్యాయం చేయడం వల్లనే వారు ఓడిపోయారని సీఎం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు, రైతులకు సేవకులుగా పనిచేస్తామని ప్రకటించారు.

2034 వరకు రాష్ట్రంలో తామే అధికారులు ఉంటామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లతో పాటు నిధులు, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిపెట్టామన్నారు.  రాష్ట్ర అభివృద్ధికి తాను దేశ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను పదేపదే కలుస్తున్నానని, అందులో స్వార్థం ఏంలేదని తేల్చిచెప్పారు గత పాలకులు కేంద్రంతో సక్యత లేకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. 30 వేల కోట్లతో హైదరాబాదులో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని దీన్ని కొందరు రియల్ స్టేట్ బ్రోకర్‌గా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన నాలుగు కోట్ల ప్రజలు తనను ఆశీర్వదించి, చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని.. వారికి సేవచేయడం తన ప్రథమ కర్తవ్యం అని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్రానికి  8 లక్షల కోట్ల అప్పులు ఉన్నా తిప్పలు పడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరుచేశామని, ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. పేదవారికి రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. 200 లోపు యూనిట్ల వారికి ఉచిత కరెంటు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం, 27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు మహిళా శక్తి క్యాంటీన్ అందించిన ఘనత ప్రజాపాలన ప్రభుత్వం దేనిని గుర్తుచేశారు. 

రెండు ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతల పేర్లు

నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోని చనాక కొరట, సదర్‌మట్ బరాజ్‌లు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు ప్రాజెక్టులకు కొత్త పేర్లు ప్రకటించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లోని ప్రజలకు విశిష్ట సేవలు అందించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వర్గీయ పీసీసీ అధ్యక్షులు పీ నర్సారెడ్డి పేరుమీద సదర్ మట్‌కు పేరు పెట్టనునట్టు ప్రకటించారు. అదిలాబాద్ జిల్లా చెం దిన స్వర్గీయ మాజీ మంత్రి సీహెచ్ రామచంద్ర రెడ్డి పేరును చెనాక కొరట ప్రాజెక్టుకు పెడుతున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి వెంటనే అక్కడే ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావును జీవో జారీచేయాలని కాంగ్రెస్ నేతలు, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 

తుమ్మిడిహట్టి పనులు త్వరలో ప్రారంభిస్తాం

  1. ఉమ్మడి జిల్లాలో ౨ లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం
  2. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తుమ్మిడి హట్టి ప్రా జెక్టు పనులకు త్వరలో శ్రీకారం చుడతామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉద్ఘాటించారు. అలా గే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని పేర్కొ న్నారు. నీటి కేటాయింపుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జలాల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం అనుసరించిన అనుచిత విధా నాల కారణంగానే ఇప్పుడు తెలుగు రా ష్ట్రాల మధ్య నీటి తగవులు వచ్చాయని అభిప్రాయపడ్డారు.

కానీ, తమ ప్రభుత్వం జలాల విషయంలో వెనక్కి తగ్గదని తేల్చిచెప్పారు. రాష్ట్ర వాటా సాధన కోసం తాము సుప్రీం కోర్టును సైతం ఆశ్రయిస్తున్నామని గుర్తుచేశారు. ఏపీలోని పోలవరం, నల్లమల ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు కేటీఆర్ అవాకులు చెవాకులు పేలితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. గత ప్రభుత్వం నిర్మించిన కొత్త ప్రాజెక్టుల్లో నాణ్యతాలోపం కారణంగా ప్రాజెక్టులు కూలిపోతున్నాయని ఆక్షేపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ఉమ్మడి పాలనలో దివంగత సీఎం  డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తుమ్మడిహట్టి ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారన్నారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వా త ఆ డిజైన్లను పక్కనపడేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పేరుతో అక్రమాలకు తెరతీసిందని మండిపడ్డారు. 

వేల కోట్ల అప్పులు తెచ్చి, ప్రాజెక్ట్ నిర్మించి కనీసం ఎకరాకైనా నీరు ఇవ్వలేకపోయిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ఆర్థిక సంక్షోభంలోనూ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నదన్నారు. పదేళ్ల కిం దట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సదర్ మట్ చనాక కోరాట ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, కానీ.. కాంగ్రె స్ ప్రభుత్వం వ చ్చిన తర్వాతే రైతులకు పరిహారం చెల్లింపులు జరిగాయని గుర్తుచేశారు. పెండింగ్ పనులను సైతం పూర్తి చేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేశామని తెలిపారు. భారత్‌లో అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు.

రాష్ట్రంలోని పేద ప్రజలకు గత ప్రభుత్వం పదేళ్లపాటు పాలించి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి నెలనెలా ప్రతి కుటుంబానికి రేషన్ అందజేస్తున్నామన్నారు. ఆ ప్రాంత జిల్లాల కు నాటి ప్రజా ప్రతినిధులు   రామచంద్రారెడ్డి,  నర్సారెడ్డి పేర్లు పెట్టేందుకు సీఎంని ఒప్పిస్తానన్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేసి అదిలాబాద్  అభివృద్ధికి బాటలు వేస్తామని హామీ ఇచ్చా రు. ప్రభుత్వ సలహాదారు  సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, వేడుమ బొజ్జు పటేల్, రామారావు పటేల్, మాజీ మం త్రులు వేణుగోపాలాచారి, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్  పాల్గొన్నారు.