calender_icon.png 13 August, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ టెంపుల్స్!?

11-08-2025 12:00:00 AM

వరుస ఘటనలతో పోలీసులకు సవాల్ 

మహబూబాబాద్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో దొంగలు దేవాలయాలకు సూటి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ నెల 2న కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం లో ప్రఖ్యాతి గడించిన శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనానికి విఫలయత్నం చేశారు.

గతంలో ఇదే ఆలయంలో చోరీ చేసి పెద్ద ఎత్తున స్వామి అమ్మవార్ల నగలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో దేవాలయ ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాక్ సిస్టం ఏర్పాటు చేయడం వల్ల ముందు గడియను బ్రేక్ చేసిన దొంగలు సెంట్రల్ లాక్ తీయలేకపోయారు. దీనితో దేవాలయంలో చోరీకి విపలయత్నం జరిగింది. ఇదే రోజు ముడుపుగల్లులోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు దొంగతనానికి పాల్పడి 2.50 లక్షల రూపాయల విలువైన అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. 

ఈ ఘటనలపై పోలీసులు ఓవైపు ముమ్మరంగా గాలిస్తుండగా, శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. హుండీ పగలగొట్టి అందులో ఉన్న సుమారు లక్షకు పైగా నగదును ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగతనానికి పాల్పడడంతో పాటు ఆలయంలో పలు వస్తువులను దొంగలు ధ్వంసం చేయడం తో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పోలీసులు ముమ్మరంగా దొంగల కోసం గాలిస్తుండగా, మరోవైపు దొంగతనాలు చేస్తూ పోలీసులకే దొంగలు సవాల్ విసురుతున్నారు. 

పెరుగుతున్న దొంగతనాల సంఖ్య

మహబూబాబాద్ జిల్లాలో ఇటు దేవాలయాలతో పాటు అటు గృహాల్లో దొంగతనాల జోరు పెరిగిపోయింది. గడచిన 6 మాసాల కాలంలో జిల్లా వ్యాప్తంగా 150 కి పైగా దొంగతనం ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపు కోటిన్నరకు పైగా విలువైన బంగారు వెండి వస్తువుల తో పాటు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఇప్పటివరకు పోలీసులు 65 ఘటనలను ఛేదించి సుమారు 80 లక్షల వరకు రికవరీ చేశారు. అయితే ఇంకా చాలా ఘటనలు పోలీసుల దర్యాప్తులో ఉన్నాయి.

ప్రధానంగా తాళం వేసిన ఇండ్లు,  నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు ఇండ్లు దొంగలు టార్గెట్ గా తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనల సరళి ఇందుకు తార్కానంగా నిలుస్తున్నాయి. దొంగలు ఏటీఎం లో నగదు దగ్గర నుండి మొదలుకొని చివరకు పందులను కూడా వదలకుండా దొంగతనాలకు పాల్పడడం మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర దొంగతనం ఘటనలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.