calender_icon.png 13 August, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎడ్‌పై అమ్మాయిల మక్కువ

13-08-2025 12:43:53 AM

  1. గౌరవప్రద వృత్తికావటంతో మొగ్గు
  2. తొలి విడతలో 9 వేల సీట్లు కేటాయించగా అందులో ఏడువేలకుపైగా వారే.. 
  3. సీట్లు పొందినవారిలో 7801 మంది అమ్మాయిలే..

హైదరాబాద్, ఆగస్టు 1౨ (విజయక్రాం తి): ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన బీఎడ్ కోర్సు ను చేస్తున్నవారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఆ కోర్సుపై అబ్బాయిల కంటే అమ్మాయిలే ఆసక్తి చూపిస్తున్నారు. డిగ్రీ చేసిన వారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలంటే బీఎడ్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరత్వం, పనిగంటల కారణంగా అమ్మాయిలు ఈ కోర్సును ఎంచుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

బీఎడ్ చేసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడొచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో చేయాలంటే డీఎస్సీ నియామక ప్రక్రియ ద్వారా ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. అదిలేదంటే ఏదైనా ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగంలో చేరొచ్చు. గతంలో బీఎడ్ అర్హత లేకున్నా ప్రైవేట్ స్కూళ్లలో ఉద్యోగాలు లభించేవి.

కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారడంతో డిగ్రీ, పీజీ ఏది ఉన్నా.. కచ్చితంగా బీఎడ్ సర్టిఫికెట్ ఉంటేనే టీచర్‌గా తీసుకుంటున్నారు. ఈక్ర మంలోనే ఎక్కువ మంది ఇటువైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు పని గంటలు తక్కువగా ఉండటంతోపాటు, పనిదినాలు కూడా తక్కువగానే ఉంటాయి. గతంలో అమ్మాయిలు ఈ వృత్తిని ఎంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపేవారుకాదు.

7801 మంది అమ్మాయిలే..

ఈనెల 10న బీఎడ్ తొలివిడత సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. మొత్తం 14,295 కన్వీనర్ కోటా సీట్లుండగా అందులో 9,955 సీట్లను కేటాయించారు. సీట్లు పొందినవారిలో అబ్బాయిలు 2154 మంది ఉండగా, అమ్మాయిలు 7,801 మంది ఉండటం గమనార్హం. క్యాటగిరీల వారీగా అమ్మాయిల వివరాలు చూస్తే ఓసీలో 442 మంది, ఎస్సీ గ్రూప్ 1-34, ఎస్సీ గ్రూప్ 2-1,155, ఎస్సీ గ్రూప్ 3 - 669, ఎసీ-930, బీసీ ఏ - 738, బీసీ బీ-1,500, బీసీ సీ -48, బీసీ డీ - 1264, బీసీ ఈ -860, ఈడబ్ల్యూఎస్ - 161 మంది ఉన్నారు.

సీట్లు పొందిన వారిలో అబ్బాయిల కంటే అమ్మాయిలు దాదాపు నాలుగురెట్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన మరో నాలుగు వేల సీట్లలోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వృత్తిపట్ల సమాజంలో గౌరవం, స్కూళ్లలో పిల్లలకు ఓపికగా వీరు బోధిస్తుండటంతో మహిళలకు అవకాశాలు లభిస్తున్నాయి. 

టీచర్ పోస్టులకు డిమాండ్..

ఉపాధ్యాయ పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్ పోస్టులను ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తుంది. గతేడాది పదివేలకుపైగా ఖాళీలను భర్తీ చేసింది. మరోవైపు టెట్ ను కూడా రెండోసారి నిర్వహించింది. ఈ కోర్సు ను పూర్తి చేసి ఉంటే భవిష్యత్తులో పడే నోటిఫికేషన్లతో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగాలు పొందొ చ్చని బీఎడ్ అభ్యర్థులు భావిస్తున్నారు.

ఈసారి ఎడ్‌సెట్-2025 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారిలోనూ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నా రు. ఎడ్‌సెట్‌కు మొత్తం 38,754 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో పురుషులు 7,217 మంది ఉండగా, మహిళలు 31,536 మంది ఉన్నారు. 5,723 మంది పురుషులు అర్హత సాధించగా, మహిళలు 25,220 మంది ఉన్నారు. గతంలో కంటే ఈసారి మొత్తం 8 వేల దరఖాస్తులు ఎక్కువగా రావటం విశేషం.