calender_icon.png 13 August, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామన్‌రావు దంపతుల హత్య కేసు సీబీఐ చేతికి

13-08-2025 12:40:59 AM

  1. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
  2. అభ్యంతరం లేదన్న తెలంగాణ ప్రభుత్వం
  3. పిటిషనర్ కిషన్‌రావుకు రక్షణ కల్పించాలని సుప్రీం ఆదేశాలు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి)/మంథని: తెలంగాణలో సంచ లనం సృష్టించిన గట్టు వామన్‌రావు, నాగమణి అడ్వొకేట్ దంపతుల హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకు న్నది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో 2021 ఫిబ్రవరి 17న అడ్వొకేట్ దంపతులు వామనరావు, నాగమణి కారులో వెళ్తుండగా, కొందరు దుండగులు వారిని అడ్డగించారు.

నడిరోడ్డుపై అందరు చూస్తుండగా దారుణంగా హత్య చేశారు. హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించింది. హత్యకు సంబంధించిన వీడియోలు సహా ఆధారాలన్నింటినీ న్యాయస్థానానికి సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదే శించింది.

రాష్ట్రప్రభుత్వం సమర్పించిన అనేక రికార్డులను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వం నోటీసులకు స్పందించి కోర్టుకు తన సమాధానాన్ని సమర్పించింది. చనిపోయే ముందు వామన్‌రావు మాట్లాడిని మరణ వాంగ్మూలం వీడియో నాడు వైరల్ అయింది.

దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో వీడియో ఎఫ్‌ఎస్‌ఎల్‌కు సైతం వెళ్లింది. వామన్‌రావు మరణ వాంగ్మూల వీడియో అసలైనదేనని, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక తేల్చింది. రాష్ట్రప్రభుత్వం అందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేసింది.

ఈ కేసుపై తాజాగా జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్‌కే సింగ్ ధర్మాసనం విచారించి.. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పునిచ్చారు. అలాగే మృతుడు వామన్‌రావు తండ్రి కిషన్‌రావుకు భద్రత కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.