09-09-2025 01:40:15 AM
పాసవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ అర్హతలేని టీచర్లలో ఆందోళన
ఉద్యోగాలు పోతాయేమోననే భయం
అర్హతలేని టీచర్లు 20 వేలకుపైనే!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యానికి టీచర్ సంఘాల డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ ఉద్యోగాలు ఉంటాయా? ఊడుతాయా? అన్న సందేహాలు, భయాలు వారిని వెంటాడుతున్నాయి. తమిళనాడుకు సంబంధించిన కేసులో ఈ నెల 1న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) అమల్లోకి వచ్చిన 2009 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులు కా వడం తప్పనిసరి అని పేర్కొంది. ఉ పాధ్యాయులు పదోన్నతులు పొం దాలన్నా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టంచేసింది.
పదవీ విర మణకు ముందు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగి లి ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే మాత్రం టెట్ తప్పనిసరి పాస్ కావాల్సి ఉంటుందని తెలిపింది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు మాత్రం టెట్ లేకుండానే సర్వీసులో కొనసాగడానికి కోర్టు అనుమతులిచ్చినట్టు పలు ఉపాధ్యా య సంఘాల నేతలు చెప్తున్నారు. విద్యా, ఉపాధ్యాయ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. సుప్రీం కోర్టు తీర్పును పునః సమీ క్షించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. టీచర్లకు మినహాయింపునివ్వాలని కోరుతున్నాయి.
20 నుంచి 30 వేల మందిపై ప్రభావం!
ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్నవారు, టెట్ లేకుండా పదోన్నతులు పొందినవారిలో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. వీరం తా ఇప్పుడు రెండేళ్లలో టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గడువులోపు టెట్ పాస్ కాకుంటే ఉద్యోగం పోయినట్టేనా? అనే భయాలను టీచర్లు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు వెలువరించిన దగ్గరి నుంచి చూస్తే వీరికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది.
రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది వరకు టీచర్లు ఉన్నారు. వీరిలో సుమారు 20 వేల నుంచి 30 వేల మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సినవారు ఉంటారని అధికారిక వర్గాల అంచనా. వీరిలో ఒక్కొక్కరు 15, 20, 25 ఏళ్లుగా సర్వీసు చేస్తున్నవారు ఉన్నారు. అప్పుడెప్పుడో ఉద్యోగాలు పొందిన వీరంతా ఇప్పుడు టెట్ రాసినా పాస్ అవుతారా? అనే అనుమానాలు ఉపాధ్యాయులనూ వెంటాడుతున్నాయి.
ఓపికగా చదవాలి.. సమయం కేటాయించాలి.. ప్రస్తుతమున్న పోటీని తట్టుకునే పరిస్థితి కొందరు ఉపాధ్యాయులకు ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలనడం భావ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వారికి స్పెషల్ టెట్ నిర్వహించాలి
ఉపాధ్యాయులకు డిపార్ట్‌మెంటల్ టెస్టుల మాదిరిగానే ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో టీచర్లలో నెలకొన్న ఆందోళనను నివారించడానికి ఎవరెవరికి టెట్ తప్పనిసరి ఉందో విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. భవిష్యత్తులో ఏ స్థాయి ఉపాధ్యాయులకు టెట్ అర్హత నిబంధన వర్తించే అవకాశముందో గుర్తించి వారిని అలర్ట్ చేసి వారందరికీ టెట్ నిర్వహించాలి.
పీ రాజభాను చంద్రప్రకాశ్, గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షుడు
రివ్యూ పిటిషన్ వేయాలి
టెట్ అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యాశాఖ లీగల్ సెల్, ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశం నిర్వహించాలి. టెట్ నిబంధనల కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులకు గతంలో ఎన్‌సీటీఈ ఇచ్చిన మినహాయింపును, రాష్ర్ట ప్రభుత్వం 2011లో ఇచ్చిన 51 జీవోలను పరిశీలించి అవసరమైతే సర్కారు రివ్యూ పిటిషన్ వేసే తదితర అంశాలను పరిశీలించాలి. వీలైనంత త్వరగా ఇది చేయాల్సి ఉంటుంది.
కటకం రమేశ్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి
రాష్ట్రంలో 2012 నుంచి టెట్ అమల్లో ఉంది. 2012, 2017, 2024లో నియామకమైన టీచర్లు టెట్ అర్హత సాధించిన వారే. కోర్టు సూచించిన నిర్దేశిత గడువులో టెట్ పాస్ కాకుంటే వారికి రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించి ఉద్యోగ విరమణ చేయించాలని స్పష్టం చేయడంతో దీనిపై ఏవిధంగా ముదుకుపోవాలనే దానిపై టీచర్లు యోచిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖలోని ఓ అధికారి చెప్పినట్టు సమాచారం.
ఉపాధ్యాయ సంఘాలు మాత్రం దీ నిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, తమ కు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. 2011లో ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటైన అనంతరం 2015లోనూ టెట్ నిబంధనలు రూపొందించిన ఉత్తర్వుల్లో 2010 ఆగస్టు 23కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మినహా యింపునిచ్చినట్టు టీచర్ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ తర్వా త అంటే 2010 ఆగస్టు 23 తర్వాత నియామకమైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. అంతకుముందు నియామ కమైన వారికి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డి మాండ్ చేస్తున్నారు.