09-09-2025 01:29:34 AM
అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠ
హైదరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): గ్రూప్-1 నియామకం కోసం ఎంతోకాలంగా అభ్యర్థులు చూస్తున్న ఎదురుచూపులు నేడు ఫలించనున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. గ్రూప్--1 నియామకాలకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు ప్రకటించనుంది. మూల్యాంకాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టింది. జూలై ౭న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వులో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గత రెండు నెలలుగా అభ్యర్థులు తీర్పు కోసం నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-౧ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని, పలు అభ్యంతరాలను పేర్కొంటూ పరీక్షలు రద్దు చేయాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషనర్ల విచారణ జరుగుతుండగా గ్రూప్-- నియామకాలు చేపట్టాలని మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై పలుమార్లు సుదీర్ఘంగా విచారణలు జరిగాయి. నేటి తీర్పుతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడనుంది.ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వ్ చేసింది.