09-09-2025 12:47:58 AM
రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించబోతున్నామని, ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం, 4 టీఎంసీలను చెరువులను నింపుకుంటూ మూసీకి తరలించి ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఉస్మాన్‌సాగర్ వద్ద రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టనున్న గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేస్--2, 3 గోదావరి తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరి తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారం భించినట్లు చెప్పారు. ఇక్కడి నుంచే జంట జలాశయాలను మంచినీటితో నింపనున్నట్లు తెలిపారు. వందేళ్లకుపైగా నగరానికి తాగునీరు అందుతున్నాయంటే నిజాం సర్కార్ దూరదృష్టియే కారణమని, కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని గుర్తు చేశారు.
నిజాం రాజు ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుం డం విశ్వేశ్వరయ్య సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. 1965లో మంజీరా నది నుంచి, 2002లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని వివరించారు. కాంగ్రెస్ తెచ్చిన గోదా వరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని, నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవని పేర్కొన్నారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుసంధానమైన మల్లన్నసాగర్ నుంచి మంచినీటినీ తరలిస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్‌ఆర్ అని గుర్తు చేశారు.
ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తీసుకురావాలని ఎవరు ప్రయత్నం చేశారో బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలన్నారు. దివంగత వైఎస్‌ఆర్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నాం అని చెప్పారు. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారని అన్నారు.
పదేళ్లలో మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు?
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నాటి సీఎం కేసీఆర్ మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాము మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుడితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తుందని మండిపడ్డారు. మాపై కడుపులో విషయం పెట్టుకొని.. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఆపొద్దని, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించేందుకు మహారాష్ర్ట సీఎంను కలుస్తామన్నారు.
కాగా కాలుష్యమయమైన మూసీ తో నల్లగొండ జిల్లావాసులు ఫ్లోరైడ్, ఇతర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చానని, ఇందుకోసం మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని, ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పారు.
గంగా, యమునా, సబర్మతి నదుల ప్రక్షాళన చేయొచ్చుగానీ తాము మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కొందరు తాటి చెట్టులా ఎదిగినా బుద్ధి మాత్రం రాలేదని పరోక్షంగా మాజీ మంత్రి హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి చురకలు అంటించారు.
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఇందుకు అందరూ కలిసి రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైసింగ్ --2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న తెలంగాణ సమాజానికి అంకితం ఇస్తామని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందని చెప్పా రు. హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు.
చిత్తశుద్ధితో హైదరాబాద్ అభివృద్ధి: మంత్రి శ్రీధర్‌బాబు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి తమ ప్రభు త్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పా రు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జంటనగరవాసులకు తాగునీటికి ఇబ్బం ది కలగకుండా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు. భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, జలమం డలి ఎండీ అశోక్‌రెడ్డి, కలెక్టర్ సి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.