09-09-2025 12:44:11 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిచెందడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ను సంది గ్ధంలోకి నెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. వాస్తవానికి హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలో ముస్లిం ఓటర్లను బీఆర్‌ఎస్ సమర్థవంతంగా ఆకర్షించ డంతోపాటు ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో మినహా మిగిలిన అన్ని స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీనే గెలుచుకున్నది. ఆ సమయంలో ఎంఐఎం పార్టీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిత్ర పక్షంగా కొనసాగడం వారికి బాగా కలిసి వచ్చింది. దీంతో ఆ రెండు పార్టీలు ఒక ఒప్పందం ప్రకారం వారి నియోజకవర్గాల్లోని ముస్లిం ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడి ఎన్నికల్లో గెలుపొందగలిగారు.
కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థికి ఎంఐఎం పట్టు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉం టుంది. మాగంటి గోపినాథ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంలోనూ ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించారు. జూబ్లీహిల్స్‌లో దాదాపు 27 శాతం ముస్లిం ఓటర్లు న్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అజారుద్దీన్ బరిలో ఉంచినప్పటికీ రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఎంఐఎం అభ్యర్థి మూడో స్థానం లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ముస్లింలను ఆకర్షించేందుకుగానూ మళ్లీ ముస్లిం అభ్యర్థినే బరిలో నిలపా లని కాంగ్రెస్ భావించింది. అజారుద్దీన్ లేక ఫిరోజ్‌ఖాన్ పోటీలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చే లా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థిని బరిలో ఉంచడాన్ని ఎంఐ ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకిస్తున్నారు. ఎంఐఎం ఎలాగూ ముస్లిం అభ్యర్థిని నిలబెడుతున్న నేపథ్యంలో కాంగ్రె స్ కూడా ముస్లింనే నిలబెడితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరి స్తున్నారు. ఫలితంగా బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
సానుభూతి అస్త్రంగా బీఆర్‌ఎస్..
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ సిట్టింగ్. 2023లో ఎన్నికల సందర్భంలో ఎంఐఎం లోపాయికారి మద్దతు కారణంగా హైదరాబాద్ పరిధిలో బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. అందులో జూబ్లీహిల్స్ ఒకటి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం మద్దతు బీఆర్‌ఎస్‌కు ఉండదు. ఎంఐఎం కారణంగా ముస్లిం ఓటర్లు, కాంగ్రెస్ చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశాల కారణంగా బీసీ ఓటర్లు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. గోపినాథ్ పేరుతో సానుభూతిని ఉప ఎన్నికల అస్త్రంగా వాడుకోనున్నది. అందులో భాగంగానే గోపినాథ్ సతీమణీ సునీతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చినా, సోదరుడు వజ్రనాథ్‌కు టికెట్ ఇచ్చినా సానుభూతి కలిసి వస్తుందని బీఆర్‌ఎస్ భావిస్తున్నది. అటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు గతంలో మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎంను ఎదుర్కొనేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నది. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ వ్యూహాలను గమనిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ స్థానాన్ని హిందువుల ఓటు బ్యాంక్ గెలుచుకోవాలనే పథకాల్లో ఉంది. ఇందుకు పార్టీ కమిటీ సమావేశాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది.
ఉపరాష్ట్రపతి ఎన్నికను అడ్డం పెట్టుకుని..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ బలపరిచిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఎంఐఎం మద్దతునిస్తున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సహకరించనున్నారు. ఈ కారణంగా జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థినే నిలపాలని కాంగ్రెస్ పార్టీ ముందు అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థి పోటీలో ఉంచితే దశాబ్దాలుగా హైదరాబాద్‌లో పాగా వేసుకుని రాజకీయంగా చక్రం తిప్పుతున్న ఎంఐఎం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన అసదుద్దీన్ ఓవైసీ ఈ రకమైన డిమాండ్ చేసినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం నవీన్ యాదవ్‌ను గానీ, బొంతు రామ్మోహన్ గానీ నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం.