13-09-2025 10:52:36 PM
మోర్తాడ్,(విజయక్రాంతి): రేపటి భవిష్యత్ నిర్మాతలు ఉపాధ్యాయులేనని వారి భుజస్కందాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో మోర్తాడ్ లోని ఆర్ అండ్ బి ఫంక్షన్ హాల్ లో శనివారం ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు శిరశినహల్ నంబులగిరి అధ్యక్షతన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డివిజన్ పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ఒక పిల్లవాని యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దరంలో ఉపాధ్యాయుడు కొవ్వొత్తులా కరిగిపోతాడని, అలాంటి త్యాగమయుల భుజస్కందాలపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, ప్రభుత్వం కూడా విద్యాభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ ఉపాధ్యాయుల్లో కూడా మరింత పట్టుదల పెరుగుతుందని అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు కేవలం బోధనలోనే కాకుండా ఎంతోమంది పిల్లలకు ఆదర్శప్రాయుడుగా నిలిచిపోతాడని, అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని అన్నారు.
ఇలాంటి ఉపాధ్యాయ దినోత్సవంలో జరిగే సన్మానాలు ఒక వేడుక మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి వారు చేస్తున్న త్యాగాలను అంకిత భావాన్ని గుర్తించేందుకు లభిస్తున్న ఒక గొప్ప అవకాశం అని అన్నారు. ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు మెమెంటులతో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు తమ అనుభవాలను వేదికపై పంచుకున్నారు. అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా సన్మాన గ్రహీతలేని, వారిని ప్రోత్సహించడానికే ఈసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆర్మూర్ డివిజన్ సంఘం అధ్యక్షులు సభాధ్యక్షులు నంబుల గిరి అన్నారు. డివిజన్ పరిధిలోని 46 పాఠశాల నుంచి 90 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను సన్మానించారు.