14-09-2025 01:01:57 AM
ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నకిరేకల్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి ): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యతను విస్మరించి, ఓఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి న ఘటన నకిరేకల్ పట్టణంలో చోటుచేసుకుంది. శనివారం ఆ విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నకిరేకల్ పట్టణం తిప్పర్తి రోడ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొంతకాలంగా ఇంగ్లీష్ టీచర్ గా మామిడి శ్రీనివాస్ పనిచేస్తున్నాడు.
అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా ,మానసికంగా వేధింపుల గురి చేస్తున్నాడు. ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు తనను వేధిస్తున్నాడంటూ శుక్రవారం తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరవమైన వృత్తిలో ఉంటూ విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిని విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరువృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.