15-07-2025 01:04:58 AM
- రాచకొండ సీపీ సుధీర్‌బాబు చర్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి)/మేడిపల్లి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గన్‌మెన్‌లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సరెండర్ చేశారు. ఆదివారం మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి సమయంలో గన్‌మెన్ 6 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. మల్లన్న కాల్పులు జరపమం టేనే జరిపామని విచారణలో చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇద్దరు గన్‌మెన్లను సరెండర్ చేయడం చర్చనీయాంశమైంది.
మండలి చైర్మన్ గుత్తాకు మల్లన్న ఫిర్యాదు
క్యూ న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి వ్యవహారం శాసన మండలికి చేరింది. తనపై, తన కార్యాలయంపై ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు, జాగృతి నేతలు చేసిన దాడిని హ త్యాయత్నంగా అభివర్ణిస్తూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాడికి సం బంధించిన పూర్తి వివరాలను ఆయనకు వివరించారు. జాగృతి నేతలు కార్యాలయంలోకి చొరబడి, తనను చంపేస్తామని బెదిరించారని, ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని సైతం ఆయన చైర్మన్‌కు అందజేశారు. నిరసనగా ప్రారంభమైన కార్యక్రమం వాగ్వాదానికి, ఆపై దాడికి దారితీసింది. ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్న మల్లన్నను బయటకు రావాలంటూ, చంపేస్తామని నినాదాలు చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
మహిళా కమిషన్ ఆఫీస్ ఎదుట ‘జాగృతి’ నిరసన
ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం మరింత ముదిరింది. మల్లన్నపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లిన జాగృతి మహిళా నాయకులను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు. కమిషన్ చైర్‌పర్సన్ అందుబాటులో లేరని, ఫిర్యాదు స్వీకరించేందుకు ఎవరూ లేరని చెప్పడంతో జాగృతి నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి నేతలు కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఒక మహిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు అందుబాటులో లేకపోవడం దారుణమని మండిపడ్డారు. మల్లన్నపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కమిషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.