calender_icon.png 13 October, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ పీఠం కోసం తహ..తహ

13-10-2025 12:24:58 AM

  1. అధ్యక్ష పదవి ఎన్నికపై నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ 
  2. ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తి కే డీసీసీ పీఠం అధిష్టానం ఆశీస్సులు ఎవరికో.. 
  3. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆశావాహుల జోరు 
  4. 13న జిల్లాకు రానున్న ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల బృందం
  5. డీసీసీ పీఠం దక్కే దెవరికో..?

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠం కోసం పలువురు తహతహలాడుతున్నారు. ఎవరికి డిసిసి పదవి దక్కుతుందో ననే ఉత్కంఠ జిల్లాలో నెలకొంది. ఈనెల 13న ఏఐసీసీ, పిసిసి పరిశీలకుల బృందం జిల్లాకు రానున్న నేపథ్యంలో డిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న పలువురు పదవి కోసం ఆరాటపడుతున్నారు. ఎమ్మెల్యేల ఆశీస్సులతోపాటు అధిష్టానం పెద్దల ఆశీస్సుల కోసం  చక్కర్లు  కొడుతున్నారు.

జిల్లా అధ్యక్షుడు తమ అనుచరుడికి అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ముఖ్య అనుచరుడు కైలాస్ శ్రీనివాసరావు గుప్తా డిసిసి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు కొనసాగుతున్నారు.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి ఎన్నికలు జరగగా ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గం లలోని పలువురు ఆశావాహులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేల ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్తున్నారు.

జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ జిల్లా కాంగ్రెస్ పదవి కోసం తహతహలాడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు సైతం అధ్యక్షునిగా మరోసారి ఉండేందుకు ప్రయత్నాలు చేయడమే కాకుండా షబ్బీర్ అలీ ఆశీస్సులతోపాటు జిల్లాలోని పలువురి నేతల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని 40 సంవత్సరాలుగా పార్టీ లో ఎన్ ఎస్ యు ఐ నేతగా విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ లో ఉంటూ వచ్చిన కైలా శ్రీనివాసరావు ఉన్నత పదవులు ఇప్పటివరకు కేవలం జిల్లా అధ్యక్ష పదవి మాత్రమే అతనికి వరించింది. జిల్లాలో ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉండడంతో తమకే మరోసారి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్లు కైలాస శ్రీనివాసరావు భావిస్తున్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరు మండలానికి చెందిన ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బద్దం ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పదవిని ఆశిస్తున్నారు. మరో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సైతం జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సదాశివ నగర్ మండలానికి చెందిన బీసీ నాయకుడు జిల్లా కాంగ్రెస్ పదవిని ఆశిస్తున్నారు.

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన మరో వ్యక్తి జిల్లా కాంగ్రెస్ పదవి కోసం స్థానిక మదన్ మోహన్ రావు ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి తన అనుచరులను జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన అనుచరునికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పదవి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి దృష్టికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి సైతం తీసుకెళ్లి చర్చించినట్లు సమాచారం.

ఏది ఏమైనా ఈనెల 13న జిల్లాకు రానున్న ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల బృందం జిల్లా కాంగ్రెస్ పదవిని ఆశిస్తున్న వారి పేర్లను సేకరించి, ఆశావహుల పేర్లను, ఎమ్మెల్యేలు సూచించిన వారి పేర్లను, వారి అభిప్రాయాలు సేకరించనున్నారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పటిష్టవంతానికి కృషి చేసే వ్యక్తులను గుర్తించి జిల్లాలోని అందరి ఎమ్మెల్యేలు అభిప్రాయాలు, నియోజకవర్గ ఇన్చార్జిల అభిప్రాయాలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలు సేకరించి జిల్లా అధ్యక్షుని పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి కోసం డీ అంటే డీ అనే విధంగా పలువురు జిల్లాలోని ఆశావహులు  పోటీ పడుతున్నారు. ఎవరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠం దక్కుతుందో వేచి చూడాల్సిందే మరి.  ...!