13-10-2025 12:00:00 AM
- బై సర్వే నెంబర్లతో ఆక్రమణలకు యత్నం
- అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు
- నిబంధనలకు విరుద్ధంగా పాసుపుస్తకాల జారీ
- గ్రీన్ ఫీల్డ్ కాలనీవాసులపై దౌర్జన్యం
మేడ్చల్, అక్టోబర్ 12(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలోని అల్వాల్ ప్రాంతంలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూములుగా పట్టా భూములను, ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరికి వివిధ శాఖల అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్లకు బై నంబర్లు వేసి పాసుబుక్కులు జారీ చేస్తున్నారు. బై నంబర్లతో పాస్ బుక్ లో జారీ కావడంతో అసలైన పట్టాదారులకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఒక సర్వే నంబర్ లో కొంత భూమి విక్రయించినప్పుడు, లేదా భాగస్వాములు భాగాలుగా చేసుకున్నప్పుడు కొత్తగా ఏర్పడే భూభాగానికి బై నెంబర్ ఇవ్వాలి.
బై నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతుంది. బై నెంబర్ వేసేముందు ఆ భూమికి సంబంధించిన లింకును పరిశీలించాలి. కానీ రెవెన్యూ అధికారులు అమ్యమ్యాలకు ఆశపడి ఏమి పరిశీలించకుండా గుడ్డిగా పాస్ బుక్కులు జారీ చేశారు. అల్వాల్ లో నిమ్మ మోహన్ రెడ్డి అనే వ్యక్తి 573 సర్వే నెంబర్ లో 3.24 ఎకరాలు, 574 సర్వే నెంబర్లు 5 ఎకరాలు సుమారు 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నాడు.
మరో వ్యక్తి 573/2,574/2 బై నంబర్లతో 3.30 ఎకరాల భూమి తనది ఉందని పలుమార్లు అంగ బలం, అర్ధబలంతో కబ్జాకు ప్రయత్నించాడు. రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పాసుబుక్కులు జారీ చేయగా, జిహెఎంసి అధికారులు ఏకంగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చారు. అక్కడ భవనాలు లేకున్నప్పటికీ భవనాలు ఉన్నట్లు ఇంటి నంబర్లు ఇచ్చిన విషయాన్ని ఇటీవల విజయ క్రాంతి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది.
ఇలాంటిదే మరొకటి....
అల్వాల్ ఖానాజీ గూడా రెవెన్యూ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ కాలనీలో సర్వే నంబర్లు 373, 375, 378, 385, 386 లో గ్రామపంచాయతీ 1987లో లే అవుట్ ను ఆమోదించింది. ఇందులో చాలామంది ఇల్లు నిర్మించుకొని 30 ఏళ్లుగా నివసిస్తున్నారు. అంతేగాక 166 జీవో కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో 185/ఎ/1/2 లో సంజీవరెడ్డికి 1.28 ఎకరాలు, మోహన్ రెడ్డికి 1.06 ఎకరాలు ఉన్నట్లు గతంలో తహసిల్దార్ పాసుబుక్ జారీ చేశారు. దీనిపై ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. గత ఫిబ్రవరి 10వ తేదీన హైకోర్టు పాసుబుక్కులు రద్దు చేసింది. అయినప్పటికీ సంజీవరెడ్డి, మోహన్ రెడ్డి బలవంతంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రీన్ ఫీల్డ్ కాలనీ వాసులకు న్యాయం చేయాలి
అనేక ఏళ్ల క్రితం చట్టపరంగా ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకొని అందులో ఉంటున్నాం. కానీ మోహన్ రెడ్డి సంజీవరెడ్డి అనే వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. వీరికి అక్రమంగా జారీచేసిన పాస్ పుస్తకాల విషయమై హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు ఆ పాస్ పుస్తకాలను రద్దు చేసింది. అయినప్పటికీ కాలనీకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మేమందరం పైసా పైసా కూడా పెట్టి లీగల్ గా ఇంటి స్థలాలు కొనుగోలు చేశాం. అధికారులు మాకు న్యాయం చేయాలి.
కే శ్రీనివాస్ రెడ్డి, కాలనీ సొసైటీ ప్రధాన కార్యదర్శి