13-10-2025 12:00:00 AM
అయినా ..అభివృద్ధికి ఆమడ దూరం
మహబూబాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి విభజించి మహబూబాబాద్ జిల్లాను 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేశారు. 2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా 2016 అక్టోబర్ 11న అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2016 అక్టోబరు 11 న నూతనంగా అవతరించిన మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ తో పాటు తొర్రూరు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. 16 మండలాలలో మొదటి 12 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా, బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు మండలాలు మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉన్న దంతాలపల్లి, వరంగల్ జిల్లాలోని నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గంగారం రెండు నూతన మండలాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత సీరోలు, ఇనుగుర్తి మండలాలను ఏర్పాటు చేశారు.
అడుగులు ముందుకు.. అడుగులు వెనక్కి..
మహబూబాబాద్ ను నూతన జిల్లాగా ఏర్పాటు చేసినప్పటికీ అభివృద్ధిలో ఆశించిన ప్రగతి సాధించలేదని విమర్శలు వస్తున్నాయి. మానుకోట జిల్లా అభివృద్ధి రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిందని చెబుతున్నారు. పరిపాలన సౌలభ్యం పేరుతో ఏర్పాటు చేసిన మానుకోట జిల్లాలో పదేళ్ల కాలంలో ఆశించిన ప్రగతి పట్టాలెక్కలేదనే విమర్శలున్నాయి.
ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయిందని, వ్యవసాయ ఆధారిత జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు జిల్లా కేంద్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని, రోడ్ల విస్తరణ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని చెబుతున్నారు. విద్య, వైద్య పరంగా కాస్త అభివృద్ధి సాధించినప్పటికీ మిగిలిన ఇతర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన విధంగా చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.
నూతనంగా పట్టణంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అతిగతి లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. పట్టణ విస్తరణకు తగ్గట్టుగా సౌకర్యాలు లేవని, మౌలిక వసతులు కూడా ఆశించిన విధంగా కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంగా మారినప్పటికీ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కొత్త రైళ్ల హాల్టింగ్, కరోనాకు ముందు ఉన్న రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ కు నోచుకోలేదని విమర్శిస్తున్నారు.
పీఓహెచ్ పైనే ఆశలు
మహబూబాబాద్ జిల్లాలో రైల్వే శాఖ ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన పిఓహెచ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. పి ఓ హెచ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన సేకరించి అప్పగిస్తే మానుకోట జిల్లా అభివృద్ధికి కొంతమేర దోహదపడుతుందని చెబుతున్నారు. ప్రత్యక్షంగా 3000 మందికి, పరోక్షంగా పదివేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం అవుతుంది. జిల్లాగా మహబూబాబాద్ ఏర్పడినప్పటికీ చెప్పుకోదగ్గ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడలేదని, పి ఓ హెచ్ ఏర్పాటుతో కొంత ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు.