06-09-2025 12:07:11 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): భారతదేశ చిప్ విప్లవానికి తెలంగాణనే లాంచ్ ప్యాడ్ అవుతుందని టెక్నాలజీ చిప్(టీ-చిప్) వ్యవస్థాపకుడు సందీప్‌కుమార్ మక్తలా స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన సెమీకాన్ ఇండియా- 2025లో టీ-చిప్ టీమ్ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మక్తాల సెమీ వర్శిటీ అండ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శారీలిస్, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్‌ఏ) డైరెక్టర్ విశ్వనాథన్‌లతో శుక్రవారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.
ఈ సందర్భంగా సందీప్‌కుమార్ మాట్లాడుతూ టీ-చిప్ ప్రతిపాదించిన ఫోర్-పిల్లర్ స్ట్రాటజీ(టాలెంట్, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, అప్లికేషన్) ద్వారా పూర్తి ఎకో సిస్టంను నిర్మించాలన్న సంకల్పాన్ని వివరించారు. వెయ్యి మంది అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్‌డీపీ) ద్వారా సెమీ కండక్టర్ సాంకేతికలో నైపుణ్యాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ౨౦౩౦ నాటికి ప్రపంచానికి కావాల్సిన సెమీకండక్టర్ నైపుణ్య శక్తిని తీర్చిదిద్దేలా సహకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
౨౦౩౦ నాటికి ప్రపంచ వ్యాపంగా ౧.౫ మిలియన్ సెమీ కండక్టర్ ప్రొఫెషనల్స్ కొరత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో కేవలం భారత్‌కే ౮౫ వేల మంది ఇంజినీర్లు, టెక్నికల్ వర్కర్స్ అవసరం పడనుంది. టీ-చిప్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఫ్యాకల్టీ ట్రైనింగ్‌తో పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు లభిస్తాయని తెలిపారు. శారీ లిస్ మాట్లాడుతూ... భారతదేశంలో అద్భుతమైన ప్రతిభ ఉందని, దానిని పరిశ్రమ అవసరాలకు సరిపడేలా తీర్చిదిద్దటం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
టీ-చిప్ భాగస్వామ్యం ద్వారా తెలంగాణలో ఫ్యాకల్టీ ట్రైనింగ్ మొదలవుతుందని, దీని వల్లన పరిశ్రమ రెడీ టాలెంట్ వేగంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డా.విశ్వనాథన్ మాట్లాడుతూ... టీ-చిప్ వంటి ప్రాజెక్టులు భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ వాల్యూ చైన్‌లో ముందంజలోకి వస్తుందని, పరిశ్రమకు కొత్త ఊపును ఇస్తాయని వెల్లడించారు.