10-12-2025 03:00:40 AM
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెంచి అధిక పతకాలు సాధించడమే లక్ష్యంగా పాలసీని అమలు చేస్తున్నామని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ భాగంగా మంగళవారం తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో క్రీడా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ క్రీడా పాలసీని ప్రకటించినట్టు తెలిపారు.
క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలతో కమిటీ సభ్యులుగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నిధుల సమీకరణ కోసం స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని నూతనంగా ఏర్పాటు చేశామని తెలియజేశారు.
బాలికలకు, పారా అథ్లెట్‌ల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు లౌబరో యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ వంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి తద్వారా ఒలింపిక్, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లకు ఆతిథ్య కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. స్పోర్ట్స్- టెక్ స్టార్టప్‌లు టూరిజం లాంటివి అన్నీ టీ- హబ్, టీఎస్ ఐపాస్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయన్నారు. అథ్లెట్‌ల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
కోచింగ్ మౌలిక సదుపాయాలు ఇన్నోవేషన్ అథ్లెట్ డెవలప్మెంట్ రంగాల్లో తోడ్పాటుకు భాగస్వాములు కావడానికి ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు. సదస్సులో మైనారిటీ శాఖ మంత్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.పీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లె, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, పీ.వీ సింధు, జ్వాలా గుత్తా, స్పోర్ట్స్ సీనియర్ జర్నలిస్ట్ బాలా మజుందార్, స్పోర్ట్స్ హబ్ మెంబర్ వితాదాని పాల్గొన్నారు.