08-12-2025 01:45:11 AM
ఫిన్లాండ్ రచయిత అంటీ తువొమైనన్ తన ప్రత్యేకమైన రచనా శైలితో అంతర్జాతీయ సాహితీ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. తన కలం నుంచి జాలువారిన అద్భుతమైన సృష్టి ‘ది హీలర్’ నవల. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు డార్క్ హ్యూమర్ మేళవించి పాఠకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా రచయిత ఈ నవల రాశారు. నవల ప్రపంచవ్యాప్తంగా 25 భాషల్లోకి అనువాదమైంది. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ కథనం సాగుతుంది.
రచయిత సస్పెన్స్‌ను నడిపిస్తూనే వాస్తవిక సామాజిక చిత్రణకు ప్రాధాన్యమిచ్చారు. ఆకట్టుకునే ప్రేమకథనూ నడిపించారు. అలాగే ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని సమస్యల గురించి కూడా చర్చించారు. నవల ఇతివృత్తం కథలోని పాత్రలు మిస్సింగ్ కేసుల చుట్టూ మాత్రమే కాదు.. సామాజిక అంశాలను స్పృశిస్తూ చర్చించేలా ఉంటాయి. తాపాని లీనియన్ అనే కవి భార్య జోహానా జర్నలిస్ట్. ఆమె ప్రత్యేకమైన వార్త కథనం కోసం అన్వేషణ మొదలు పెడుతుంది.
ఈ క్రమంలో ఆమె అదృశ్యమవుతుంది. ఎక్కడో తెలియని చోట నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను అన్వేషించే పనిలో తాపాని పడతాడు. ఈ క్రమంలోనే అతడికి సీరియల్ కిల్లర్ గురించి తెలుస్తుంది. తన దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. జర్నలిస్టుగా తన భార్య జోహానా మనోభావాలను అర్థం చేసుకుంటాడు. ఆమెలోని భిన్నమైన పార్శాలను తెలుసుకుంటాడు. తన అన్వేషణ సాగించిన నగరం హెల్సింకి.
కథనం ప్రారంభంలోనే నగరంలో వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఒక రకమైన విపత్తు నగరాన్ని ఆవహించిన ప్రభావం నవలలో కనిపిస్తుంది. అలాగే నగరంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు తలకిందలవుతూ ఉంటాయి. ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. నగర ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. నగరం ఎంతటి విపత్తు ఎదుర్కొంటుందంటే.. సిటీలోని సబ్ టన్నెల్స్ నీటితో నిండుతాయి.
శాంతిభద్రతలు గాడి తప్పాయి. ప్రైవేటు శక్తులు భద్రతా వ్యవస్థను తమ కబంధ హస్తాల్లోకి తీసుకుంటాయి. ఈ హృదయ విదారకమైన దృశ్యాలను రచయిత మన కళ్లకు కట్టినట్లువ వివరిస్తారు. వాతావరణ విపత్తులు మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అంశంపై రచయిత రోమాంచకమైన శైలిలో వివరించారు. ఈ నిరాశపూరితమైన వాతావరణంలో తాపాని తన భార్య కోసం సాగించిన అన్వేషణ ఉత్కంఠను రేపుతుంది. ఇదే సమయంలో సమాంతరంగా నగరవాసులు బతుకులను కాపాడుకునేందుకు చేసే జీవన్మరణ పోరాటాన్నీ రచయిత ఆవిష్కరించారు.
అయిఏత.. కథనంలో చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే కచ్చితంగా నవల చదవాల్సిందే. ఈ కథనం ద్వారా రచయిత ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనుగడ సాధించాలనే సంకల్పం మానవాళిలో ఉండాలని పరోక్షంగా చెప్తారు. కథనాన్ని రచయిత ఎంత ఉత్కంఠతో చెప్తారో, అదే స్థాయిలో డార్క్ కామెడీని కూడా మేళవిస్తూ కథనం నడిపించారు. ఆయన శైలి ఎంతో పదునుగా ఉంటుంది. కథనం వేగంగా సాగుతుంది.
పాత్రల మనస్తత్వాలు సూటిగా గుండెను గుచ్చుకునేలా ఉంటాయి. భావోద్వేగాల చిత్రణ ఉద్విగ్నంగా ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందంటే పాఠకుడు ప్రత్యక్షంగా హెల్సెంకి నగరంలో ఉన్నట్టు భావిస్తాడు. ప్రపంచ సాహిత్యాన్ని చదవాలనుకునే వారికి ఈ పుస్తకం గొప్ప అనుభూతినిస్తుంది. రచయిత్రి లోలారోజర్స్ ఈ నవలను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఈ అద్భుతమైన రచనను పాఠకులకు చేరవ చేయడంలో అనువాదకురాలు వై.కృష్ణజ్యోతి చేసిన కృషిని కచ్చితంగా అభినందించాలి. రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఆమె పనిచేస్తున్నారు.
ఒకవైపు వృత్తిగత పనులు చూసుకుంటూనే, మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నవలలను తెలుగు పాఠకుల కోసం అనువాదం చేస్తున్నారు. ఆమె తెలుగు అనువాదం సరళంగా, సూటిగా సాగింది. మూల రచనలోని ఫినీష్ సంస్కృతి నేపథ్యాన్ని తెలుగు పాఠకులకు అనుగుణంగా తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. మూల రచనలోని భావాలను, ఉద్వేగాలను ఏమాత్రం చెడకుండా చూసుకున్నారు. ఆ ఉత్కంఠను నవల చివరి వరకు కొనసాగించారు. సస్పెన్స్ థిల్లర్స్‌ను ఇష్టపడే ప్రతి పాఠకుడూ తప్పక చదవాల్సిన పుస్తకమిది.
(ప్రతుల కోసం ఛాయ పబ్లికేషన్స్ వారి www. chaaya books.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు)