calender_icon.png 8 December, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెలంగాణ సింహ’ధ్వని

08-12-2025 01:47:58 AM

“కదనాన శత్రువుల

కుత్తుకల నవలీల

నుత్తరించిన బలోన్మత్తు

లేలిన భూమి...

వీరులకు కాణాచిరా!

తెలంగాణ ధీరులకు మొగసాలరా !” 

అంటూ 1944లో రావెళ్ల వెంకట రామారావు రాసిన కవిత్వం ఒక సంచలనం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలంలో ఆయన కవిత్వం దావానలం. నైజాం ప్రభుతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నా డు. దళ కమాండర్‌గా పనిచేశాడు. ఏళ్లకు ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఒకవైపు ఉద్యమంలోనే పనిచేస్తూనే, మరోవైపు సాహిత్యరంగంలోనూ తన ప్రతిభ న చాటాడు.

రావెళ్ల వెంకట రామారావు 1930 జనవరి 30న లక్ష్మయ్య, తల్లి సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గోకినపల్లి. వెంకటరామరావు అన్న సత్యనారాయణ ముందు నుంచి రాజకీయా ల్లో ఉన్నారు. తమ్ముడు కృష్ణారావు పోస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న వామపక్ష ఉద్యమాల్లో పాల్గొనేవాడు. అలా చిన్నప్పటి నుంచే రావెళ్ల ఇంట్లో రాజకీయ వా తావరణం ఉండేది.

నూనుగు మీసాల ప్రాయంలో ఆయన్ను సామాజిక అసమానతలు ప్రభావితం చేశాయి. సమాజంలో దోపిడీకి వ్యతిరేకంగా ఏమైనా చేయాలనే సంకల్పం ఉండేది. నైజాం ప్రభుత్వంలో అకృత్యాలను చూసి చలించిపోయేవాడు. 14 ఏళ్ల వయస్సులోనే ఆయన ఆంధ్ర మహాసభలో సభ్యుడయ్యాడు. యుద్ధంతంత్రాలు నేర్చాడు. తుపాకీ చేతబట్టి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నాడు.

ఫైరింగ్ జరిగిన సమయంలో ఆయనకు ఒకానొకప్పుడు బుల్లెట్ గాయం కూడా అయింది. గోకినపల్లి కేంద్రంగా రావెళ్ల వందలాది మందికి సైనిక శిక్షణ ఇచ్చాడు. దళ కమాండర్‌గా పనిచేశాడు. 21 ఏళ్ల వయస్సులో రావెళ్లకు సుగుణమ్మతో వివాహమైంది. వారికి నలుగురు కుమారులు. అనేక కేసుల్లో రావెళ్ల అరెస్టు ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 

***

వాగ్దానముల కుప్ప వంధిమాధులొప్ప

సాధించుటే గొప్ప సాహసంబది యప్ప

దౌర్జన్య భుజబలము ధనముతో లోగొనుము

ఎన్నికల్లో జయము వెన్నాడుటే నిజము 

...అంటూ ‘అనలతల్పం’ అనే కవితలో అప్పగి సమకాలీన రాజకీయాలపై విమర్శనస్త్రాలు సంధించాడు. రాజకీయ నేతలు  కుల, మంత, ప్రాంత, వర్గ, భేదాలతో ప్రజలను ఎలా విడగొడతారో వివరించాడు.  

‘అబలయని దేశమును కబళింప తలపడిన

వరరాజులకు, స్త్రీల పటు శౌర్యమ్మును జూపి

రాజ్యతంత్రము నడిపెరా! తెలంగాణ

రాణి రుద్రమ దేవిరా !’ అంటూ రావెళ్ల కవిత ద్వారా కాకతీయుల సామ్రాజ్యంలో రుద్రమదేవి పోరాట పటిమను కీర్తించారు. రావెళ్ల బతికి ఉన్నంత కాలం తెలంగాణ గురించి పరితపించాడు. ఈ ప్రాం తంపై ఉన్న ప్రేమకు గొప్ప ప్రతీక ‘మాతృగీతిక’. ఆలయ కుడ్యాలపై లాలిత్యరేఖలను కీర్తించారు. శ్రీవైష్ణవ గీతాల్లోని భక్తిని, బసవన్న సేవలను కొనియా డారు. పాల్కురికి సోమనాథుడి ప్రగతి బాటను వివరించాడు.

పోతనామాత్యుడిని పలవరించాడు. ముక్కలుగా ఉన్న తెలంగాణ, ఏనాటికైనా ఒక్కటవుతుందని, ఇక్కడ ప్రజలు తమ పౌరుషాగ్నిని చూపి ఉద్యమించాలని పిలుపునిచ్చాడు. అడుగడగునా రాజ్యంపై ధిక్కారాన్ని ప్రకటించాడు. సామాన్యుడే సాహసాలు చేయగలడు. నవ నాగరికత నిర్మించగలడు అని భావించినవాడు. ‘కులము వారల కట్టు కూటాల లోగుట్టు/ మంత్రి పదవికి పట్టు మర్మమని పెట్టు’ అంటూ కులంపై దుమ్మెత్తిపోశాడు. 

సుప్రీంకోర్టులో గర్జన

ఓ కేసులో సుప్రీం కోర్టులో హాజరుపరచగా ప్రత్యర్థుల తరఫు న్యాయవాదులు ఉన్నవి లేనివి కల్పించి రావెళ్ల గురించి చెప్తున్నారట. అప్పుడు రావెళ్ల సిం హంలా గర్జించాడట. అక్కడి గోడకు వేలాడుతున్న గాంధీ చిత్రాన్ని చూపిస్తూ ‘గాంధీ మహాత్మా.. ఈ అబద్ధాలకోరులకు సరైన బుద్ధి చెప్పేవారు లేరా? వాళ్ల ముఖం చూడటానికి కూడా నాకు అసహ్యమేస్తుంది’ అని బిగ్గరగా వ్యాఖ్యలు చేశాడట.

అక్కడున్న న్యాయవాదులంతా బిత్తరబోయి ‘యే తెలంగాణ షేర్ హై’  అని కొనియాడారట. ఉద్యమ జీవితమే కా కుండా రావెళ్లకు సాహి త్య జీవితమూ ఉంది. కవిగా, కథకుడిగా ఆయన ఎన్నో కవితలు, కథలు రాశారు. అవి మద్రాసు నుంచి వెలువడే ‘స్వతంత్ర’లో అచ్చయ్యేవి. ఆయన రాసిన ‘దాగని నిజం’ అనే కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రావెళ్ల రాశారు. ఒకవైపు ఉద్యమంలో పాల్గొంటూనే సాహితీ రచనా వ్యాసాంగమూ కొనసాగించారు. రావెళ్ల ఉద్యమ పా టలను మలితరం వాగ్గేయకారులు కూడా కళ్లకద్దుకున్నారు.

దేశపతి శ్రీనివాస్, యశ్‌పాల్, జయరాజు ఎన్నో సభల్లో పాడి పరవశించారు. ఆయన సేవలకు గాను రావెళ్లను నాటి పెద్దలు ‘తెలంగాణ షేర్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. సాహిత్య కృషికి గుఱ్ఱం జాషువా స్మారకం, గురజాడ అప్పారావు పురస్కా రం, దాశరథి పురస్కారాలు వరించాయి. బతికి ఉ న్నంత కాలం రావెళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్నే ఆకాంక్షించారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటే ఆ కల సాకారం కావడం అంతా కష్టమేమీ కాదని చెప్పేవాడు. వృద్ధాప్య సమస్యలతో ఆయన 2013 డిసెంబర్ 10న కన్నుమూశారు. తన చిరకాల వాంఛ అయినా ‘తెలంగాణ రాష్ట్రాన్ని చూడలేకపోయారు.

౧౦న రావెళ్ల వర్ధంతి

స్వాతంత్య్ర తొలిసమర

శత్రువులు, వంచకులు

నైజాము పాలకుల

కైజారు పోటులకు

****

ముక్కలుగ చీలిందిరా!

తెలంగాణ

రక్తమే చిందిందిరా!

****

దాస్య నిగళచ్ఛేద

ధర్మయజ్ఞములోన,

రాత్రించరుల నిశా 

రాజ్యపీఠము గూలె

****

నవయుగోదయమాయెరా !

తెలంగాణ

నవమల్లియలు విరిసెరా !

****

భూగర్భమున నిధులు

పొంగిపారెడి నదులు

శృంగార వనతతులు

బంగారముల పంట

****

నాతల్లి తెలంగాణరా  !

వెలలేని పందనోద్యామ్మురా !