27-09-2025 01:29:49 AM
-కల్వర్టు నుంచి కిందకు కాల్వను తవ్విన హైడ్రా అధికారులు
-పనులను అడ్డుకున్న బాధితులు
-ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ ధర్నా
తుర్కయంజాల్, సెప్టెంబర్ 26: తొర్రూరు-బ్రాహ్మణపల్లి మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఎర్రకుంట చెరువు సమస్యకు హైడ్రా అధికారులు తాత్కాలిక పరిష్కారం చూపారు. శుక్రవారం భారీ బందోబస్తు మధ్య కల్వర్టు నుంచి కిందనున్న వెంచర్ వరకు నీరు వెళ్లేందుకు కాల్వను తవ్వారు. హైడ్రా సీఐ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారుల సమక్షంలో పనులు చేపట్టారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులను పలువురు రైతులు, మహిళలు హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. తమకు ఉన్న కాస్త భూమిని కూడా పనికిరాకుండా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా హైడ్రా సీఐ తిరుమలేష్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం, విపత్తు నిర్వహణ కింద తాత్కాలికంగా పరిష్కారం చూపినట్లు తెలిపారు. 60 ఫీట్ల రోడ్డు వెంటే కాల్వను తవ్వినట్టు పేర్కొన్నారు. చెరువు, కల్వర్టు విషయం హైడ్రా దృష్టిలో ఉందని, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ నేతల చొరవతో పరిష్కారం
తొర్రూరు ఎర్రకుంట చెరువు కల్వర్టుతో కొన్నిరోజులుగా ఇరుగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీవర్షాల వల్ల చెరువు నిండుకుండలా మారి అలుగు పారుతోంది. దీంతో వాహనాలు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రాహ్మణపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొంతం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రంగారెడ్డి ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులను అలర్ట్ చేశారు. హుటాహుటిన సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఎలిమినేటి తిరుమలరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎలిమినేటి ధన్ పాల్ రెడ్డి, బ్యాంకు డైరెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
చెరువు వద్ద బీఆర్‌ఎస్ నేతల ధర్నా
తొర్రూరు ఎర్రకుంట చెరువు వద్ద కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన రోడ్డును తిరిగి యథావిధిగా నిర్మించాలని బ్రాహ్మణపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. కల్వర్టు వద్ద వర్షంలో రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన ప్రాంతంలో ఎలాంటి అలుగు లేదని, కొందరి స్వలాభం కోసం రోడ్డును ఇష్టారీతిన తవ్వారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంపతీశ్వర్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.