03-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఓటర్ల జాబితా సవరణ చేసి తుది జాబితా ఖరారు చేస్తున్న నేపథ్యంలో పోటీ చేయడానికి అభ్యర్థుల్లో రిజర్వేషన్ గుబులు రేపు తోంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరి పెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, 65,851 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా, 10,902 ఓటర్లు ఉన్నారు.
కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 16,161 మంది ఓటర్లు ఉన్నారు. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా 13,687 మంది ఓటర్లు ఉన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 21,826 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను అయా మున్సిపాలిటీల్లో ప్రదర్శించారు. 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా నాలుగింటిని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కొత్తగా కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది.
దీనితో మహబూబాబాద్ జిల్లాలో ఈసారి ఐదు మున్సిపా లిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ జనరల్ కు కేటాయిం చగా, తొర్రూరు ఎస్సీ జనరల్ కు, డోర్నకల్ ఎస్టీ జనరల్ కు, మరిపెడ ఎస్టి మహిళకు కేటాయించారు. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనితో ఆశావాహుల్లో రిజర్వేషన్ల గుబులు పట్టుకుంది.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తొలిసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధిం చేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు మళ్ళీ బాటలు వేసుకోవాలని బిఆర్ ఎస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఎవరికి అనుకూలంగా వస్తాయి అన్నది ప్రస్తుతం అంతు చిక్కని వ్యవహారంగా మారింది. 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తారని ప్రచారం సాగుతోంది.
2011 జనవరి ప్రాతిపదికనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి రిజర్వేషన్ తో పాటు చైర్మన్ పదవి ఆశించే వారికి అనుకూలంగా వార్డు కౌన్సిల్ రిజర్వేషన్లు కూడా వస్తేనే గెలుపుకు కొంత దోహదపడుతుంది. చైర్మన్ ఆశావహులు చైర్మన్ పదవితో పాటు తమ గెలుపునకు అనుకూలంగా ఉన్న వార్డుల్లో రిజర్వేషన్ అనుకూలిస్తే తప్ప విజయం సాధించే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీనితో మున్సిప ల్ ఎన్నికల వ్యవహారం రిజర్వేషన్లపై ఆధారపడి ఉన్నట్లు చెబుతున్నారు.
మహిళల ఓట్లు కీలకం..
మహబూబాబాద్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా అన్నింట్లో కూడా పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళల ఓట్లు అధికంగా ఉండడంతో ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా మారనున్నాయి. మహబూబాబాద్‌లో పురుషుల ఓట్లు 31,595 ఉండగా మహిళల ఓట్లు 34,215 ఉన్నాయి. అలాగే డోర్నకల్ లో పురుషుల ఓట్లు 5,171 ఉండగా, మహిళల ఓట్లు 5,731 ఉన్నాయి.
కేసముద్రంలో 7,906 పురుషుల ఓట్లు ఉండగా, మహిళల ఓట్లు 8,255 ఉన్నాయి. మరిపెడలో 6,709 పురుషుల ఓట్లు ఉండగా, 6,978 మహిళల ఓట్లు ఉన్నాయి. తొర్రూరులో 10,696 పురుషుల ఓట్లు ఉండగా, 11,122 మహిళల ఓట్లు ఉండడం విశేషం. జిల్లా వ్యాప్తంగా పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 4,000 కు పైగా అధికంగా ఉన్నాయి.
రోస్టర్ కొనసాగిస్తారా లేదా?
2020లో అప్పటి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో రెండు టర్ముల రొటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లను రూపొందించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడడం, మరికొన్ని అప్ గ్రేడ్ కావడంతో, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో రొటేషన్ విధానం కొనసాగుతుందా, కొత్తగా మళ్లీ రిజర్వేషన్లు ప్రకటిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.