calender_icon.png 3 January, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే శాఖ, ఒకే వేతన విధానం అమలు చేయాలి

03-01-2026 12:00:00 AM

  1. 121 జీవోను రద్దుచేయాలి

అందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్తింపజేయాలి 

ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక జేఏసీ నేతలు

హనుమకొండ టౌన్, జనవరి 2 (విజయక్రాంతి): దేవాదాయ వ్యవస్థకు మూల స్తంభాలైన అర్చక ఉద్యోగులకు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, రాష్ట్రం వ్యాప్తంగా ఒకే శాఖ, ఒకే వేతన విధానాన్ని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక ఉద్యోగుల సదస్సు కు పాతర్లపాడు నరేష్ శర్మ అధ్యక్షతలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగుల ఉపేందర్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ డి.వి.ఆర్. శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ 577 జీవో అమలులో అధికారుల నిర్లక్ష్యంతో 2017 ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 686 దేవాలయాల్లో 5625 మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు అందాల్సి ఉందన్నారు. కానీ ఇప్పుడు కేవలం 3327 మందికి మాత్రమే వేతనాలు అందుతున్నాయని, మిగతా 2223 మందికి దేవాదాయశాఖ అధికారులు అన్యాయం చేశారని విమర్శించారు.

ముఖ్యంగా 121 జీవో సాకుగా చూపి 1500 మందికిపైగా అర్చకులకు అన్యాయం చేస్తున్నారని ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖలో అధికారులకు రాజబోగం అర్చకులకు అర్థాకళి  అసమానతులను తీవ్రంగా ఖండించారు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న అర్చకులకు కనీసం 1500 రూపాయల వేతనం కూడా అందజేయడం లేదని అదే ఆదాయం నుంచి 12 శాతం ఈఏఎఫ్ ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు మాత్రం ట్రెజరరీ వేతనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10వ షెడ్యూల్ ప్రకారం నూతన దేవాలయ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని, అధికారుల కోసం కాకుండా హిందూధర్మ పరిరక్షకులైన అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఒకే శాఖ, ఒకే వేతనం చట్ట సవరణ చేయాలని వరంగల్ వేదికగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు గట్టు శ్రీనివాసచార్యులు, రవీంద్ర చార్యులు, వెల్ఫేర్ బోర్డ్ సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమార చారి, నారాయణస్వామి, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ, ఉపాధ్యక్షులు టక్కరి సత్యం, టిఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమయ్య, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.