23-01-2026 11:47:49 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును(BRS Working President) శుక్రవారం సిట్ విచారిస్తోంది. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద జారీ చేసిన నోటీసుల మేరకు, ప్రత్యేక దర్యాప్తు బృందం కేటీఆర్ ను ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది.
సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని బృందంలో భాగమైన జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఈ విచారణను నిర్వహిస్తారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు స్టేషన్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, స్థానిక, ప్రత్యేక బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా, పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను ముందుగానే అరెస్టు చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్లలో కొంతమంది విద్యార్థులను వారి హాస్టళ్ల నుండి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్వీ కార్యదర్శి జంగయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రమే కాకుండా తెలంగాణ భవన్ సమీపంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ ప్రధాన గేటును బలవంతంగా మూసివేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై గేటు వద్దే బైఠాయించన బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. "ఇదేం రాజ్యం.. ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం" అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.