17-11-2025 01:02:13 AM
-నిరసనకు అనుమతి నిరాకరణ పౌర హక్కులను హరించడమే
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సీజేఐ జరిగిన దాడికి నిరసనగా సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పౌర హక్కులను హరించడమేనని విమర్శించారు.
సీజేఐపై దాడికి ప్రయత్నిస్తే దేశ వ్యవస్థలన్నీ చర్యలకు ఉపక్రమించకుండా.. మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని మండిపడ్డారు. జస్టిస్ గవాయ్ స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులుంటే ఈ తరహా ఘటన జరిగేదా.. ? సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును ఎందుకు స్వీకరించలేదు..? జస్టిస్ గవాయ్‌కి న్యాయం జరగాలని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాం. ఆయనపై దాడియత్నం విషయంలో రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి ’ అని విమర్శించారు. రాజ్యాంగ రక్షణ, దళితులపై దాడులను ఎదుర్కోవడం కోసమే ఢిల్లీలో సభ పెట్టినట్లు మందకృష్ణ తెలిపారు.