calender_icon.png 15 October, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవిత ఖైదే హంత‌కుడు..!

14-10-2025 08:52:58 PM

* గిరిజ‌న మ‌హిళ‌ను అత్యాచారం, హ‌త్య చేసిన నిందితుడు

* మ‌రో మ‌హిళ హ‌త్య కేసులో జీవిత ఖైదీ శిక్ష 

* శిక్ష ప‌డుతుంద‌నే ఘాతుకానికి పాల్ప‌డిన వైనం 

* సంచ‌ల‌నం రేపిన హ‌త్య కేసును చేధించిన పోలీసులు

* వివ‌రాలు వెల్ల‌డించిన మెద‌క్ ఎస్పీ శ్రీ‌నివాస‌రావు

మెద‌క్‌ (విజ‌య‌క్రాంతి): జీవిత ఖైదీ శిక్ష ప‌డిన నేర‌స్థుడే గిరిజ‌న మ‌హిళ‌ను హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు తేల్చారు. గిరిజ‌న మ‌హిళ‌ను వివస్త్ర‌ను చేసి చెట్టుకు క‌ట్టేసి అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా దారుణంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో సంచ‌ల‌నం రేపింది. నిందితుడికి ఓ మ‌హిళ హ‌త్య కేసులో జీవిత ఖైదీ శిక్ష‌ను సోమ‌వారం న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. మంగ‌ళ‌వారం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీ‌నివాస‌రావు మీడియా స‌మావేశంలో నిందితుని వివ‌రాలు వెల్ల‌డించారు. నిజామాబాద్ జిల్లా వ‌ర్ని మండ‌లం సేవాలాల్ తండాకు చెందిన ఫ‌కీర నాయ‌క్ సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి మండ‌లం అంబోజిగూడ‌లో నివాసం ఉంటున్నాడు. అయితే గ‌తంలోనే ఫ‌కీర్ నాయ‌క్‌పై ఏడు కేసులు ఉన్నాయ‌ని, మెద‌క్ ప‌ట్ట‌ణంలో ఓ మ‌హిళ‌ను అత్యాచారం చేసి హ‌త్య చేశాడ‌ని తెలిపారు. అలాగే మ‌రో మ‌హిల‌ను క‌ల్లు దుకాణంలో అత్యాచారం చేసేందుకు య‌త్నించిన‌ట్లు తెలిపారు.

ఇలాంటి నేరాల‌పైనే నిందితుడిపై ఏడు కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. గ‌తంలో మ‌హిళ హ‌త్య కేసులో కోర్టులో తుది తీర్పు రాగా అత‌నికి జీవిత ఖైదు శిక్ష‌ను విధించారు. ఎలాగూ శిక్ష ప‌డుతుంద‌ని భావించిన ఫ‌కీర్ నాయ‌క్ మెద‌క్ ప‌ట్ట‌ణంలోని అడ్డా కూలీ వ‌ద్ద మ‌హిళ‌ను ప‌ని కోస‌మ‌ని చెప్పి బ‌స్సులో కొల్చారం మండ‌లం ఏడుపాయ‌ల క‌మాన్ వ‌ద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. త‌న కోరిక తీర్చాల‌ని కోర‌డంతో అందుకు ఆమె ఒప్పుకోవ‌డంతో నిందితుడు పైశాచికంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు తెలిపారు. ఆమె ఒంటిపై బ‌ట్ట‌లు తొల‌గించి చెట్టుకు క‌ట్టేసి అత్యాచారం చేశాడు. రోజంతా ఆమెపై అత్యాచారం చేసి చివ‌ర‌కు రాయితో బాది అక్క‌డి నుంచి వెళ్ళిపోయాడు. నేరుగా మెద‌క్ చ‌ర్చి వ‌ద్ద‌కు వ‌చ్చి బ‌ట్టలు మార్చుకొని వెళ్ళిన‌ట్లు తెలిపారు. బ‌ట్ట‌లు లేకుండా చెట్టుకు కొన ఊపిరితో ఉన్న మ‌హిళ‌ను గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు తెలిపారు. 

స‌వాల్‌గా తీసుకున్న పోలీసులు...

తీవ్ర సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు స‌వాల్ గా తీసుకున్న ఎస్పీ శ్రీ‌నివాస‌రావు ఇద్ద‌రు డీఎస్పీలతో ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు జ‌రిపారు. వైన్స్ వ‌ద్ద మ‌ద్యం తీసుకుంటున్న సీసీ కెమెరా దృశ్యాలను గుర్తించి విచారించ‌గా మ‌హిళ‌పై అత్యాచారం, హ‌త్య చేసింది పాత నేర‌స్తుడు ఫ‌కీర్ నాయ‌క్‌గా గుర్తించారు. అయితే అప్ప‌టికే మ‌రో మ‌హిళ హ‌త్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సోమ‌వారం తీర్పునిచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హ‌త్య స్థ‌లంలో తీసుకువెళ్ళిన ముక్కు పుడ‌క‌, హ‌త్య‌కు ఉప‌యోగించిన రాయి, కర్ర‌, చ‌ర్చి వ‌ద్ద పారేసిన బ‌ట్ట‌లు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఎలాగూ శిక్ష ప‌డుతుంద‌న్న నెపంతో త‌న కోరిక తీర్చుకోవాల‌నే అడ్డా కూలీని అత్యాచారం చేసి హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. కాగా గిరిజ‌న మ‌హిళ హ‌త్య కేసును త్వ‌ర‌గా ఛేదించి నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసుల‌ను జిల్లా ఎస్పీ శ్రీ‌నివాస‌రావు అభినందించారు. ఇందుకు కృషి చేసిన ఇద్ద‌రు డీఎస్పీలు, సిఐ, ఎస్‌.ఐ, సిబ్బందిని ప్ర‌శంసా ప‌త్రాలు, న‌గ‌దుతో స‌త్క‌రించారు. ఈ స‌మావేశంలో అద‌న‌పు ఎస్పీ మ‌హేంద‌ర్‌, మెద‌క్, తూప్రాన్ డీఎస్పీలు ప్ర‌స‌న్న‌కుమార్‌, న‌రేంద‌ర్‌గౌడ్‌, సీఐ జార్జ్ ఎస్ఐ అమ‌ర్ పాల్గొన్నారు.