23-09-2025 12:05:09 AM
ఘనంగా మహారాజా అగ్రసేన్ 5149వ జయంతి
బంజారాహిల్స్‌లోని విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మహారాజా శ్రీ అగ్రసేన్ చూపిన సమాజ హితం, సమానత్వ మార్గం దేశాభివృద్ధికి మార్గదర్శకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. మహారాజా అగ్రసేన్ 5149వ జయంతి సందర్భంగా సోమవారం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి భట్టి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సమాజ సంక్షేమం కోసం, సమానత్వం కోసం అహర్నిశలు శ్రమించిన మహారాజా అగ్రసేన్ ఆలోచనలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
వైశ్యులు రాజకీయంగా ఎదగాలి: మాజీ ఎంపీ గిరీష్‌సంఘీ
దేశ ఆర్థిక పరిస్థిని శాసించే స్థాయిలో వైశ్యులు ఉన్నారని, రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉందని ఆలిండియా వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ గిరీష్ సంఘీకుమార్ అన్నారు. దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంస్థలు వైశ్య సమాజం చేతిలో ఉన్నప్పటికీ సంఘటితంగా లేరని తెలిపారు. మహారాజ్ అగ్రసేన్ 5149 జయంతిని సందర్భంగా బంజారాహిల్స్‌లో ఆలిండియా వైశ్య ఫెడరేషన్, తెలంగాణ అగర్వాల్ సమాజ్ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరీష్ సంఘీ మాట్లాడుతూ..
వైశ్య సమాజం రాజకీయంగా ఎదకగపోవడానికి పేరున్న వ్యక్తి రాజకీయాల్లో లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలంగా ఉన్నామని, రాజకీయంగా లేకపోవడం తీరని లోటుగానే ఉందన్నారు. తాను 2004లో ఎంపీగా ఉన్నానని, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనకంటే జూనియర్లేనని గిరీష్ సంఘీ అన్నారు.