calender_icon.png 23 September, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి జీఎస్టీ 2.0

23-09-2025 01:18:22 AM

-అమల్లోకి కొత్త జీఎస్టీ స్లాబులు

-ఉప్పు నుంచి కార్ల దాకా తగ్గిన ధరలు

-సిన్ గూడ్స్‌కు పెరిగిన ధరలు, విలాస వస్తువులకు కూడా..

-375 రకాల ఉత్పత్తులపై తగ్గిన ధరలు

-బీమాపై పన్నులు సున్నా.. 

-జీఎస్టీ బచత్ ఉత్సవ్ జరుపుకోండి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఉప్పు పప్పుల నుంచి ఎలక్ట్రిక్ బైక్స్, కార్ల వరకు చాలా వస్తువుల ధరలు సోమవారం నుంచి తగ్గు ముఖం పట్టాయి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబుల్లో మార్పులే ఈ ధరల తగ్గుదలకు కారణం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ స్లాబులను కుదిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ మార్పులు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో వస్తువుల ధరలు తగ్గాయి. దాదాపు 400 వస్తువల ధరలు తగ్గాయి. మానవాళికి హానికరంగా ఉన్న కొన్ని రకాల వస్తువుల ధరలు మాత్రం పెరిగాయి. నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని రెండే స్లాబులకు మార్చి మరింత సరళంగా మార్చారు. వంటగది సామగ్రి నుంచే ధరల తగ్గుదల ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును చాలా కంపెనీలు ప్రజలకు అందే విధంగా ఉత్పత్తుల ధరలు తగ్గించాయి. ఇంకా కొన్ని కంపెనీలు మాత్రం ధరలు తగ్గించే యోచనలో ఉన్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పాల ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. కేవలం పాల ఉత్పత్తులు మాత్రమే కాకుండా రైళ్లలో లభించే రైల్ నీర్ బాటిళ్ల ధరలు కూడా తగ్గిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తగ్గింపుల వల్ల వ్యవస్థలోకి రూ. 2 లక్షల కోట్ల నగదు వస్తుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. పండుగల సీజన్‌లో జీఎస్టీ బచత్ ఉత్సవ్ జరుపుకోండి అని ప్రధాని పేర్కొన్నారు.

‘ఈ ఉత్సవ్ వల్ల ప్రజలకు డబుల్ బొనాంజా అందనుంది. తక్కువ జీఎస్టీ వల్ల ప్రతి ఇంటికి మునుపటికంటే ఎక్కువ ఆదా కానుంది. వ్యాపారాలకు మరింత సులభం కానుంది’ అని మోదీ తెలిపారు. అరుణాచల్ పర్యటనలో ఉన్న ప్రధాని వ్యాపారస్తులను కలిశారు. సోమవారం సూర్యుడి ఉదయించే కంటే ముందే ధరలు తగ్గుతాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈటా నగర్‌లో ప్రధాని మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో రూ. 5,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం 

ఏసీలు, డిష్ వాషర్‌లు మరింత చవకగా లభించనున్నాయి. కేవలం ఏసీలు మాత్రమే కాకుండా టీవీలు, కంప్యూటర్ మానిటర్స్, ప్రొజెక్టర్స్ ధరలు కూడా తగ్గాయి.   ఇన్ని రోజులు 28 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్న ఈ వస్తువులు 18 శాతానికి మారుస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ నిర్ణయంతో సామాన్యుడికి మరింత ఊరట లభించింది. ఆటోమొబైల్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గాయి. 

ప్రముఖ కార్ల కంపెనీలన్నీ ఉత్పత్తులప ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇన్ని రోజులు అన్ని రకాల జీవిత, ఆరోగ్య బీమాలపై కంపెనీలు పన్నులు విధించేవి. కొత్త సంస్కరణల్లో భాగంగా అన్ని రకాల బీమా ప్రీమియంలపై పన్నులను తొలగించారు. అంతే కాకుండా పాఠశాలల్లో విని యోగించే అన్ని రకాల వస్తువులపై పన్నులు తొలగించారు. ల్యాప్‌టాప్స్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లపై పన్నులు అలాగే ఉంచారు. వాటి స్లాబ్స్ మార్చలేదు. 

హానికర వస్తువులు మరింత ప్రియం!

జీఎస్టీ సంస్కరణల వల్ల చాలా రకాల వస్తువుల ధరలు తగ్గినా హానికర వస్తువుల ధరలు మాత్రం పెరిగాయి. మరీ ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల ధరలను కరెంట్ షాక్ కొట్టే విధంగా పెంచేశారు. హానికర వస్తువులు మాత్రమే కాకుండా కొన్ని రకాల విలాసవంత వస్తువుల ధరలు కూడా  పెరిగాయి. 

౫% జీఎస్టీ

నిమ్మకాయలు, బీడీ ఆకులు, రబ్బరు బాండ్లు, టాల్కమ్ పౌడర్, తల నూనె, షాంపూ, షేవింగ్ క్రిమ్, ఆప్టర్ షేవ్ లోషన్, కొవ్వొత్తులు, మార్బుల్, గ్రానైట్, ఫొటోగ్రాఫిక్ ప్లేట్స్, ఎక్స్‌రేకు వాడే ఫిల్మ్, కార్పెట్లు, కాటన్ రగ్గులు, మ్యాథమెటికల్ బాక్స్‌లు, జామెట్రిక్ బాక్స్‌లు, కలర్ బాక్స్‌లు, మిల్క్ క్యాన్స్, కాపర్‌తో చేసిన వంట సామగ్రి

౧౮% జీఎస్టీ

బీడీలు, సిమెంట్ ఉత్పత్తులు, బొగ్గు, బయో డీజిల్, పేపర్, పేపర్ బోర్డ్, ఏయిర్ కండీషన్ మెషిన్లు, డిష్ వాషర్ మెషిన్లు

౪౦% జీఎస్టీ

పాన్ మసాలా, నాటు పొగాకు, సిగరెట్లు, కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్, మోటరు వాహనాలు, ౩౫౦ సీసీ కంటే ఎక్కువ ఉండే మోటర్ సైకిళ్లు, కెఫినేటెడ్ పానీయాలు, లగ్జరీ కార్లు (1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ కలవి), లగ్జరీ బైక్స్ (350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ కలవి), గుర్ర పు పందేలు, లాటరీలు, ఆన్‌లైన్ మనీ గేమింగ్స్, క్యాసినోస్, స్మోకింగ్ పైప్స్