calender_icon.png 23 September, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిధుల లేమితో దసరా పండుగ జరిపేదెట్లా!?

23-09-2025 12:00:00 AM

అయోమయంలో పంచాయతీ కార్యదర్శులు 

మహబూబాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో పంచాయితీల నిర్వహణ భారాన్ని నెత్తికెత్తుకున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం దసరా పండుగ నిర్వహిం చడం ఎలా అనే అయోమయంలో పడ్డారు.

దాదాపు రెండు సంవత్సరాలుగా పంచాయతీల నిర్వహణ బాధ్యతలను చేపట్టిన పంచా యతీ కార్యదర్శులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇప్పటికే జేబు నుంచి చెల్లింపులు చేస్తూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, మైనర్ రిపేర్లు చేయిస్తు న్నారు. ఈ క్రమంలో దసరా పండుగ నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు గుది బండగా మారింది.

దాదాపు 13 నెలలకు పైగా పంచాయతీల నిర్వహణ బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతో, కొంతకాలం ఫర్ముల ద్వారా ఎలక్ట్రికల్ సామాగ్రి, పైప్ లైన్లకు సామాగ్రి, ఇతర సామాగ్రి తెచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఫర్మ్ యజమా నులు కూడా పంచాయతీలకు సామాగ్రి ఉద్దెరగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

దీనితో గత కొంతకాలంగా తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు తమ వేతనాల్లో నుంచి కొంత గ్రామ ప్రజల ఇబ్బందుల తీర్చడానికి వినియోగిస్తుండగా, ఇంకొంతమంది బయట అప్పులు తెచ్చి గ్రామాల్లో పైప్ లైన్ల మరమ్మత్తులు, వీధిలైట్లు, ఇతర చిన్న చిన్న మరమ్మత్తులు చేయించారు. అది కూడా ఇప్పుడు మరింత భారం కావడంతో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ బయటకు చెప్పుకోలేక లోపల దాచుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 482 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఒక్కో పంచాయతీకి తక్కువలో తక్కువ లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల వరకు బిల్లులు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 5 కోట్ల వరకు పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల ముత్యాలమ్మ బోనాల పండుగ ప్రతి గ్రామంలో నిర్వహించగా అప్పుడు కూడా అప్పు తెచ్చి నిర్వహించామని, ఇప్పుడు అప్పు కూడా అప్పుడు పుట్టని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

ప్రతిరోజు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్కు డీజిల్ ఖర్చులు కూడా చెల్లించే పరిస్థితి లేకుండ పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచులు బాధ్యతగా తీసుకొని ఘనంగా దసరా పండగ నిర్వహించే పరిస్థితి ఉండగా, పంచాయతీ కార్యదర్శులు ఆ స్థాయిలో నిర్వహించలేకపోతున్నట్లు చెబుతున్నారు. నిత్యం తాగునీరు, పారిశుధ్య నిర్వ హణ, వీధిలైట్లు, చిన్న చిన్న మరమ్మతులకు చేతి నుండి డబ్బులు పెట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

దసరా నిర్వహణ జరిపేది ఎట్లా?

గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం వల్ల దసరా పండగ నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారింది. ఇప్పటికే చేతి నుండి కొంత, అప్పు తెచ్చి మరికొంత పెట్టుబడి పెట్టి గ్రామాల్లో నిర్వహణ భారాన్ని తలకు మించినప్పటికీ మోస్తున్నామని ఇప్పుడు దసరా పండుగ నిర్వహిం చడం తమకు గగనంగా మారిందని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడంతోపాటు దసరా పండుగ ఘనంగా నిర్వహించడానికి అవసరమైన లైటింగ్, ఇతర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా దసరా పండుగ ఘనంగా ఎలా చేయాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు అయోమయం చెందుతున్నారు.

కనీసం గ్రామంలో వీధిలైట్లు వేసే పరిస్థితి లేదని, ఫర్ము షాపుల నుండి ఉద్దెర సామాగ్రి ఇవ్వడం లేదని, దసరా పండుగకి కనీసం వీధి దీపాలు లేకపోతే ఎలా అని లో లోపల మదన పడుతు న్నారు.

ఈ క్రమంలో దసరా పండుగ నిర్వహించడం తలకు మించిన భారంగా మారిందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు దసరా పండుగ నిర్మాణ కోసం నిధుల విషయంపై ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా , ఈ అంశంపై నోరు విప్పడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా అంతట ఇదే పరిస్థితి నెలకొంది. వద్దన్నపేట నియోజకవర్గంలో గత ఏడాది దసరా పండుగ నిర్వహించిన ఖర్చుల బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని, ఈసారి దసరా పండగ ఆర్థిక సమస్యల వల్ల తాము నిర్వహించలేమని, ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజుకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు.