23-09-2025 12:00:00 AM
-కార్పొరేషన్ ఆదాయానికి భారీ గండి
-భవన యజమానులకు అధికారుల భజనలు ??
-పట్టణంలో ఒక ఫంక్షన్ హాల్‌కే అనుమతులు
-అనుమతులు లేని ఫంక్షన్ హాల్స్‌పై చర్యలేవి?
-మామూళ్ల మత్తులో కార్పొరేషన్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) :ప్రజల అవసరాలను ఆదాయ వనరులుగా మలుచుకొని కొందరు అడ్డగోలు వ్యాపారం చేస్తూ లక్షల దోపిడీకి పా ల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి.. అధికారులకు అడిగినంత ఇచ్చి.. భవ నం నిర్మించి ఫంక్షన్ హాల్ గా నామకరణం చేసి దర్జాగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
అంతా తెలిసిన అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అక్ర మాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ధ్రువపరుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు వ్యాపారాలు జో రుగా సాగుతున్నాయి. అందుకు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని పాల్వంచ డివిజన్ 27 లో సుమారు 16 నుంచి 18 ఫంక్షన్ హాల్స్ ఉంటే సుగుణ గార్డెన్ ఫంక్షన్ హాలు కు మినహా మిగిలిన ఏ ఫంక్షన్ హాలుకు అనుమతులు లేక పోవడం జిల్లాలో అక్రమ ఫంక్షన్ హాల్స్ వ్యాపారం తీరును స్పష్టం చేస్తోంది.
పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ కు కూత వేటు దూరంలో గణేష్ కన్వర్షన్ హాల్, పాల్వంచ మండల పరిధిలో నిర్మించిన హెచ్ కన్వర్షన్ హాల్ కు తప్పుడు ధృవీకరణ పత్రాలతో అనుమతులు పొం దారు. మండల పరిధిలోని ఫంక్షన్ హాల్ ను పట్టణ పరిధిలో ఫంక్షన్ హాలుగా చూపి అధికారులను తప్పుదోవ పట్టించి ఫంక్షన్ హాల్ లో నిరభ్యంతరంగా కొనసాగిస్తున్నారు. ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఇంత జరుగుతున్నా అధికారులెవరు చర్యలు తీసుకో కపోవడం గమనార్హం.
ప్రజల అవసరమే ఆదాయం..
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనలో మార్పులు వచ్చాయి. పుట్టినరోజు వేడుకల నుంచి దశదిన కర్మల వరకు ప్రజలు ఫంక్షన్ హాల్ లను ఆశ్రయిస్తున్నారు. అదే పరమావధిగా కొందరు భవనాలు నిర్మించి ఫంక్షన్ హాలు గా అనుమతులు లేకుండా నిర్వహిస్తూ రూ లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారు. అక్రమ వ్యాపారాలను, అనుమతులు లేని ఫంక్షన్ హాల్ లను అరికట్టాల్సిన అధికారులు ఆమ్యామ్యా ల మత్తులో మునిగి ప్రభుత్వ ఆదాయాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.
ఒక్కో ఫంక్షన్ హాలుకు ఒక్కో రేటు చొప్పున విధిస్తూ పాల్వంచ డివిజన్ ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని నిర్వాహకులు ప్రజల నుండి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్రమంగా ఫంక్షన్ హాలు కొనసాగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది వారికే తెలియాలి. పాల్వంచ డివిజన్లో ఏ ఒక్క ఫంక్షన్ హాలుకు అనుమతులు పొందేందుకు సరైన వసతులు లేవనేది స్పష్టంగా కని పిస్తోంది. కొన్ని ప్రవేట్ ఫంక్షన్ హాల్స్ ప్రభుత్వ భూముల్లో ఉంటే, కొన్ని ఫంక్షన్ హాల్లో పార్కింగ్, ఫైర్ సేఫ్టీ లేదు. కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ఆదాయ పన్ను ఎగనామం పెట్టేందుకే ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమ మార్గంలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.
అడ్డగోలు వ్యాపారం...రూ.. లక్షల్లో దోపిడీ..
పాల్వంచ డివిజన్ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు ఫంక్షన్ హాల్ వెలుస్తున్నాయి. దానికి తోడు ధరలను విపరీతంగా పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఏసీ ఫంక్షన్ హాల్ అయితే ఇక రేటు చెప్పనవసరం లేదు. ఉదయము నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఏసి వేసి ఆ తర్వాత నిలుపుదల చేస్తారు. చెల్లించాల్సిన రేటు మాత్రం వారు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే నని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఫంక్షన్ హాలుకు ఒక్కొక్క ధర నిర్ణయించి ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.
ఒక ఫంక్షన్ హాల్ కే అనుమతి...
పాల్వంచ పట్టణ పరిధిలో ని సుగుణ గార్డెన్స్ ఫంక్షన్ హాలుకు మాత్రమే అనుమతులు ఉన్నాయని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. పట్టణంలో సుమారు 16 నుంచి 18 ఫంక్షన్ హాల్ కొనసాగుతున్నాయి. దీన్ని బట్టి మిగిలిన ఏ ఫంక్షన్ హాలుకు అనుమతులు లేవని తెలుస్తోంది. అనుమతులు లేని ఫంక్షన్ హాల్స్ పై కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకొని జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న అక్రమ ఫంక్షన్ హాల్స్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
అనుమతులు లేకుండా నడుస్తున్న ఫంక్షన్ హాల్ను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. గణేష్ కన్వర్షన్ హాలు అక్రమ నిర్మాణం పై కూల్చవేతకు నోటీసులు జారీ చేస్తే, యజమాని కోర్టును ఆశ్రయించి మున్సిపల్ ఉన్నతాధికారులతో చర్చించేందుకు అనుమతి కోరడంతో ప్రస్తుతం కోర్టు పది లోకి చేరిందన్నారు. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్తామన్నారు. హెచ్ కన్వర్షన్ హాల్ సర్వే నెంబర్లు వ్యత్యాసం వల్ల ముందుకు పోలేకపోతున్నా మని, ఇటీవల అదనపు నిర్మాణం నిమిత్తం అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించడం జరిగిందన్నారు.కన్వర్షన్ హాల్ రూరల్ పరిధిలో ఉన్నట్లు రూడీ అయితే మున్సిపల్ కార్యాలయం నుం చి జారీ చేసిన ఇంటి నెంబర్లను రద్దు చేస్తామని తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత