12-01-2026 01:21:02 AM
బీసీ నాయకుల ఆగ్రహం మహాదేవపూర్‌లో ఉగ్ర స్వరం
మహాదేవపూర్, జనవరి 11 (విజయక్రాంతి): బీసీలను చిల్లర గాళ్లుగా చూసే ధోరణిని ఇక సహించేది లేదని బీసీ సంఘాల నాయకులు ఘాటుగా హెచ్చరించారు. మహాదేవ పూర్ ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో బీసీ నాయకులు సముద్రాల తిరుపతి తీవ్ర స్థాయిలో ప్రభుత్వానికి, అధికారులకు స్పష్టమైన హెచ్చరి కలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు ఎవ్వరూ చిల్లర గాళ్లు కాదు. బీసీలను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు. కొంతమంది బీసీ నాయకులే బీసీలను అవమానించేలా మాట్లాడటం బాధాకరం. ఇది బీసీల ఆత్మగౌరవంపై దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి
ఈ ప్రాంతానికి చెందిన మంత్రి శ్రీధర్ బాబు గారు నిజమైన బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దొంగ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి సర్టిఫికెట్లు రద్దు చేయాలని కోరారు. బీసీలంతా మంత్రి మాట కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు.
నాగుల సంతోష్ ఘాటైన ప్రశ్నలు
నాగుల సంతోష్ మాట్లాడుతూ కాళేశ్వరం గ్రామంలో గెలిచిన వెన్నపు రెడ్డి మోహన్ రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించారు. నీ కుల ధ్రువీకరణ పత్రం హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా తీసుకున్నానని అంటున్నావు. అయితే 2018లో అప్లై చేసినప్పుడు ఆ పత్రాలు ఎందుకు సమర్పించలేదు? నీ అప్లికేషన్ పత్రాలు నా చేతిలో ఉన్నాయి అని స్పష్టం చేశారు. మోహన్ రెడ్డి, ఆయన సతీమణి ఇద్దరూ బీసీ గాండ్ల కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారని, అయితే కాళేశ్వరంలోని ఇతరులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ప్రకాశ్ రెడ్డి ఇటీవల ఎవ్వరూ కొత్తగా కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకోలేదు అన్న వ్యాఖ్యలపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 02 డిసెంబర్ 2025న రేగొండ మండలానికి చెందిన తోటపల్లి సావిత్రి గాండ్ల కుల ధ్రువీకరణ తీసుకుని కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది నిజం కాదా? రేగొండ తహసీల్దార్ వీరిని రెడ్డి గాండ్ల కులస్తులని, దొంగతనంగా గాండ్ల సర్టిఫికెట్ తీసుకున్నారని ప్రెస్ మీట్లో చెప్పింది నిజం కాదా? రేగొండ పోలీస్ స్టేషన్లో సావిత్రిపై కేసు నమోదయిందా? అని వరుసగా ప్రశ్నించారు.
వెన్నంపల్లి మహేష్ వ్యాఖ్యలు
హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ, గాండ్ల సంఘాల ఐక్య వేదిక ప్రెస్ మీట్లో కొందరు బీసీ నేతలు బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పని వెన్నంపల్లి మహేష్ అన్నారు. ఒక బీసీ నాయకుడే బీసీలను చిల్లర గాళ్లు అనడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ప్రాంతీయ సమస్య కాదు. రాష్ట్రవ్యాప్త రాజకీయ, ఆర్థిక, మానవ హక్కుల సమస్య అని పేర్కొన్నారు.
సత్య నిర్ధారణ కమిటీ వేయాలి
2018లో కొంతమంది అధికారుల తప్పిదం వల్ల రెడ్డి కులస్తులకు గాండ్ల కుల ధ్రువీకరణ పత్రాలు జారీయ్యాయని, బీసీ కమిషన్ ఇప్పటికే 2010లోనే ఈ సర్టిఫికెట్లు రద్దు చేయాలని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. రెడ్డి గాండ్ల కులస్తుల వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక సత్య నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు బొల్లం కిషన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.