29-12-2025 02:44:52 AM
ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలు నెల రోజుల పాటు నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఫ్యూచర్ సిటీ’పై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వానికి ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదన్నారు. రేపు బీఏసీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదంగా మార్చడమే అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ర్టంలో చర్చించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని అన్నారు.
శాసనసభ సాక్షిగా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క బిల్లును కూడా ఆమోదింపజేయలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా కృష్ణా, గోదావరి బేసిన్లపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు ముందుకు రాలేదన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఫుట్ బాల్ మ్యాచ్‌లకు వందల కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ‘భూభారతి’ పేరుతో సెటిల్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, గోలి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.