29-12-2025 01:22:29 AM
ఇప్పటికీ సీసీలకు నోచుకోని పల్లెలెన్నో...
ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం
అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయాలని ప్రజల వేడుకోలు
వేములపల్లి, డిసెంబర్ 28 : ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం. ఎక్కడైనా చోరీలు, ప్రమాదాలు వంటివి చోటు చేసుకుంటే నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర. పోలీసులు వారం రోజుల్లో చేయాల్సిన దర్యాప్తు వీటి సహాయంతో ఒక్కరోజులోనే పూర్తిచేసే వీలుంటుంది.
ఆధునిక సమాజంలో నేరాలు పూర్తిగా మారిపోయాయి. పూటకో తీరుతో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణకు సీసీ కెమెరాలు వినియోగం ఉపయుక్తంగా ఉంటుందనేధి జగమెరిగిన సత్యం.
మండలంలో ఇలా..
వేములపల్లి మండలంలో 12 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అన్నపరెడ్డిగూడెం, వేములపల్లి, బుగ్గ బావి గూడెం, శెట్టిపాలెం , మొల్కపట్నం, సల్కునూరు, మంగాపురం కామేపల్లిగూడెం ,రావులపెంట, లక్ష్మీదేవి గూడెం ,అమనగల్లు, తిమ్మారెడ్డి గూడెం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో అమనగల్లు ,రావులపెంట ,శెట్టిపాలెం లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
శెట్టిపాలెం గ్రామంలో సుమారుగా 10 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని ఒకటి, రెండు మాత్రమే పనిచేస్తాయి. ఆయా గ్రామాలలో సీసీ కెమెరాలు కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. గత కొన్ని నెలలుగా వరుసగా జరుగుతున్న సంఘటనలు నిఘా నేత్రాలు పనిచేయకపోవడం గ్రామాలలో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సీసీ కెమెరాలను పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికీ కెమెరాలు నోచుకోని గ్రామాలు
మండలంలో ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆధునిక కాలంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ మండలంలోని లక్ష్మీదేవి గూడెం, మొల్కపట్నం, సల్కునూరు, మంగాపురం ,అన్నపరెడ్డిగూడెం, కామ పళ్లి గూడెం, బుగ్గ బావి గూడెం, తిమ్మారెడ్డి గూడెం తదితర గ్రామాలలో సీసీ కెమెరాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు.
రాత్రి వేళలో దొంగతనాలు, అనుకోకుండా జరిగే సంఘటనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో నిఘా వ్యవస్థ గట్టిగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం పర్యవేక్షించాలి
మండలంలోని పలు గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా నీడను నిత్యం పర్యవేక్షిస్తూ నేరాలను తగ్గించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి. కొన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటికి మెయింటెనెన్స్ సరిగా లేక పని చేయడం లేదు అధికారులు ప్రజాప్రతినిధులు నిఘ వ్యవస్థను పటిష్టపరిచి నిత్యం పర్యవేక్షించాలి. దీంతో నేరాలు దొంగతనాలు జరగకుండా ఆపవచ్చు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను తొందరగా గుర్తించి శిక్షపడేలా చేయవచ్చు.
మేరెడ్డి పృథ్వి కుమార్ రెడ్డి, మొల్క పట్నం గ్రామస్తుడు
సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలి
గ్రామాలలో ప్రధాన కూడలలతో పాటు ప్రధాన రహదారి పై ఉన్న గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు తావు ఉండదు. పొరపాటున ప్రమాదాలు జరిగిన నేరాలు చేసి పారిపోయిన నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం. సీసీ కెమెరాల విలువను తెలుసుకొని ప్రతి గ్రామపంచాయతీలో కెమెరాలను ఏర్పాటు ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు సహకరించాలి.
ఎస్సై డి వెంకటేశ్వర్లు