29-12-2025 12:04:07 AM
నాలుగో టీ20లోనూ భారత్ విజయం
చివర్లో రిఛా ఘోష ధనాధన్
భారత్ 221/2, శ్రీలంక 191/6
భారత మహిళల క్రికెట్ జట్టు అదే జోరు... షెఫాలీకి తోడు స్మృతి మంధాన విధ్వంసం.. చివర్లో రిఛా ఘోష్ మెరుపులు...వెరసి నాలుగో టీ20లో భారత్ భారీస్కోరు చేసింది. ఛేజింగ్‌లో శ్రీలంక కూడా పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగిన చివరికి ఇండియాదే పైచేయిగా నిలిచింది. ఫలితంగా సిరీస్‌లో మరో విజయంతో ఆధిక్యాన్ని 4 పెంచుకుంది.
తిరువనంతపురం, డిసెంబర్ 28 : సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో టీ ట్వంటీలోనూ శ్రీలంకపై విజయం సాధించింది. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే లంక కాస్త పోరాడడం ఒక్కటే చెప్పుకోదగిన విషయం. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ అనారోగ్యంతో దూరమవగా..క్రాంతి గౌడ్‌కు రెస్ట్ ఇచ్చారు. వీరి స్థానాల్లో హార్లిన్ డియోల్, అరుంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన విధ్వంకర ఆరంభాన్నిచ్చారు. గత రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన షెఫాలీ నాలుగో టీ20లోనూ రెచ్చిపోయింది.
ఆమెకు తోడు స్మృతి కూడా మెరుపులు మెరిపించింది. వీరిద్దరూ లంక బౌలర్లను ఆటాడుకోవడంతో భారత్ రన్‌రేట్ పదికి పైగా సాగింది. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 61 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా షెఫాలీ, స్మృతి జోరు తగ్గలేదు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. తొలి వికెట్‌కు 15.1 ఓవర్లలోనే 162 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. షెఫాలీ వర్మ 30 బంతుల్లోనే హ్యాట్రిక్ ఫిఫ్టీ బాదగా.. స్మృతి 35 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. మరింత ధాటిగా ఆడే క్రమంలో షెఫాలీ 79 ( 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన 80 (48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యారు. వీరిద్దరి పార్టనర్‌షిప్ టీ20ల్లో భారత్‌కు ఏ వికెట్‌కైనా అత్యధికం.
అలాగే భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా స్మృతి రికార్డులకెక్కింది. వీరిద్దరూ ఔటైనప్పటకీ చివర్లో రిఛా ఘోష్ విధ్వంసం సృష్టించింది. కేవలం 16 బంతుల్లోనే 40 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసింది. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 221 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మైశా, నిమిశ తలో వికెట్ తీశారు. భారీ లక్ష్యఛేధనలో శ్రీలంక మహిళల జట్టు కూడా ధాటిగానే ఆడింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే ఆ జట్టు ఓపెనర్లు హాసిని పెరీరా, కెప్టెన్ చమరి ఆటపట్టు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 59 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని అరుంధతి రెడ్డి బ్రేక్ చేసింది.
హాసిని పెరీరా 30 (20 బంతుల్లో 7 ఫోర్లు) పరుగులకు పెవిలియన్‌కు పంపింది. తర్వాత ఇమేశా దులానీతో కలిసి ఆటపట్టు దూకుడు కొనసాగించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. పిచ్ ఫ్లాట్‌గా ఉండడంతో స్కోరు వేగంగానే సాగింది. అయితే స్పిన్నర్ వైష్ణవి శర్మ లంక కెప్టెన్ ఆటపట్టు 52 (37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రన్స్‌కు ఔట్ చేసింది. ఇక్కడ నుంచి లంక జట్టులోని మిగిలిన బ్యాటర్లు కూడా దూకుడుగానే ఆడారు. చివర్లో భారత బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు టీ20 సిరీస్‌లో భారత్ 4 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ఇదే వేదికలో మంగళవారం జరుగుతుంది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్: 221/2 ( మంధాన 80, షెఫాలీ 79, రిఛా ఘోష్ 40 నాటౌట్; షెహానీ 1/32, నిమిశ 1/40)
శ్రీలంక ఇన్నింగ్స్: 191/6 ( ఆటపట్టు 52, హాసిని 33, దులానీ 29; వైష్ణవి శర్మ 2/24, అరుంధతి రెడ్డి 2/42, శ్రీచరణి 1/46)
మంధాన @ 10000
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయి అందుకుంది. 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. అలాగే భారత్ తరపున మిథాలీరాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా ఘనత సాధించింది. ఇన్నింగ్స్‌ల పరంగా మాత్రం స్మృతి సరికొత్త రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 10 వేల క్లబ్‌లో చేరింది. స్మృతి కేవలం 280 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయి చేరుకుంది. గతంలో మిథాలీ రాజ్ 314 ఇన్నింగ్స్‌లో 10,868 పరుగులు చేసింది.