calender_icon.png 29 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలంపై గళం!

29-12-2025 02:23:19 AM

నీళ్ల హక్కులే బీఆర్‌ఎస్ ప్రధాన అజెండా..

  1. అసెంబ్లీ వేదికగా పోరుకు సిద్ధం
  2. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేసే ప్రయత్నం
  3. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ఇరుకున పెట్టే వ్యూహం
  4. నీటి హక్కుల సాధన దిశగా ప్రజా ఉద్యమం
  5. అవసరమైతే కేంద్రంతోనూ పోరుకు సై

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయాల్లో నీళ్లే కేంద్ర బిందువుగా మారుతున్నాయి. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణ అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ పార్టీ గళం విప్పుతున్నది. సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాన అజెండా గా మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు పెంచుతోంది.

జల హక్కుల విషయంలో పాలకపక్షం రాజీపడుతోందన్న ఆరోపణలతో ఇరుకున పెట్టేలా సమగ్ర కార్యాచరణకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్ ప్రారంభించబోతున్న పోరాటానికి అసెంబ్లీ వేదిక కానున్నది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో జల వనరులపై ప్రత్యేక చర్చ, తక్షణ తీర్మానం, ప్రభుత్వ నిర్ణయాలపై శ్వేతపత్రం డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వ్యూహం సిద్ధం చేసింది. ముఖ్యంగా 45 టీఎంసీలకు ఒప్పుకున్న అంశం, కృష్ణా నీళ్లపై తెలంగాణ హక్కుల త్యాగమని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రజల మధ్యకూ జలసమస్య..

కృష్ణా నీళ్లపై తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గట్టిగా నిలబడలేకపోతోందన్న ప్రశ్నను బీఆర్‌ఎస్ ప్రధానంగా ముందుకు తెస్తోంది. పాలమూరు డిండి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదన్న విమర్శలు కూడా రాజకీయ చర్చకు కేంద్రంగా మారుతున్నాయి. అసెంబ్లీ వేదికపై ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడమే కాదు, రైతు సం ఘాలు, ఆయకట్టు రైతుల సమస్యల తో ప్రజల మధ్య కు వెళ్లే ప్రణాళిక లు బీఆర్‌ఎస్ సిద్ధం చేస్తోంది.

ముఖ్యంగా కృష్ణా నీళ్ల పై తెలంగాణకు నష్టం కలిగించే నిర్ణయాలకు కారణం, కేంద్ర జల శక్తి శాఖ వద్ద తెలంగాణ వాదన ఎందుకు బలంగా వినిపించడం లేదు, పాలమూరు డిండి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై స్పష్టత లేకపోవడం, ట్రైబ్యునళ్ల ముందు ప్రభుత్వం దృఢమైన వాదన వినిపించకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీలో మాత్రమే కాకుండా ప్రజల మధ్యకు కూడా జల సమస్యను తీసుకెళ్లే యోచనలో ఉంది.

ప్రజా ఉద్యమం దిశగా..

తమ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి సాగునీటి కొరత ఏర్పడలేదని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ప్రాజెక్టుల్లో నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. నీళ్ల కొరత అంటే రైతుల భవిష్యత్తుపై దాడేనని వాదిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, ఆయకట్టు విస్తరణ, రైతులకు నీటి భరోసా అంశాలతో ప్రజాభిప్రాయాన్ని మలచే ప్రయత్నం చేస్తోంది.

బీఆర్‌ఎస్ పోరాటం అసెంబ్లీకి పరిమితం కాదన్న సంకేతాలు ఇప్పటికే ఇచ్చింది. రైతు సంఘాలు, ఆయకట్టు రైతులతో కలిసి జల సమస్యలను గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సాగు సంక్షోభంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే ముప్పని వాదనతో ప్రజాభిప్రాయాన్ని మలచే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణలకూ కీలకంగా మారే అవకాశం ఉంది. 

కేంద్రంతోనూ పోరాటానికి సిద్ధం..

జల వివాదాల్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్ బలంగా ఆరోపిస్తోంది. ట్రైబ్యునల్ నిర్ణయాల అమలులో జాప్యం చేయడం, కృష్ణా, గోదావరి బోర్డుల పాత్రపై స్పష్టత ఇవ్వకపోడం, నీటి కేటాయింపుల్లో కేంద్ర మౌనం వహించడం వంటి అంశాలపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా నీటి వాటాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, కేటాయింపులు, పాలమూరు ఎత్తిపో తల ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనుకకు పంపడంపై ప్రధాని మోదీకి లేఖలు రాయాలని యోచిస్తుంది.

సాగునీటి కేటాయింపులను సాధించుకోవడానికి అవసరమైతే ఢిల్లీ వేదికగా ధర్నా, ఎంపీలు, రైతు సంఘాలతో కలసిన జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టేందుకు పార్టీ సిద్ధమవుతోంది. తద్వారా కృష్ణా, గోదావరి నదులు నీటి కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యం, పోలవరం, ప్రాజెక్టు ద్వారా గోదావరి బేసిన్‌లో నీటిని నల్లమల సాగర్ ద్వారా తరలించే కుట్రను ఎండగట్టాలని చూస్తుంది.

మొత్తంగా నీళ్ల హక్కులు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన అజెండాగా మారుతున్నాయి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, సాగునీటి వాటాల కేటాయింపుల అంశంలో కేంద్రంపై ఒత్తిడి, రైతు సంక్షేమమే లక్ష్యంగా ఉద్యమాలను కలుపుకుని బీఆర్‌ఎస్ జలంపై గళాన్ని వినిపించనున్నది.