29-12-2025 01:59:00 AM
ఘటన జరిగిన 6 నెలలకు స్పందించిన పోలీసులు
పటాన్‌చెరు, డిసెంబర్ 28: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గత జూన్ 30న సిగాచి కంపెనీలో భారీ విస్పోటనం కారణంగా 54 మంది మృత్యువాత పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇంతమంది మరణానికి కారణమైన సిగాచి కంపె నీ యాజమాన్యం, సీఈవోపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు కొనసాగించి గుట్టుచప్పుడు కాకుండా సీఈవోను అరెస్టు చేశారు. సిగాచి ఘటనలో మృతి చెందిన కార్మికులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి..మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆదేశించినా, విచారణ కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ బాధితులకు న్యాయం జరగడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేశారు. అంతేగాకుండా కంపెనీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈవో అమిత్ రాజ్‌ను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.