calender_icon.png 29 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరక్షా.. నీకు రక్షణ ఎవరు?

29-12-2025 12:16:23 AM

  1. దర్జాగా 60 ఫీట్ల రోడ్డు ఆక్రమించి అపార్ట్మెంట్ కడుతున్న శ్రీ రక్ష  కన్స్ట్రక్షన్స్ 
  2. సెట్ బ్యాక్ నిబంధనలను గాలికి వదిలిన సంస్థ 
  3. అనుమతులు ఒక తీరు నిర్మాణం మరో తీరు
  4. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలపై అనుమానం 

వికారాబాద్, డిసెంబర్ 28(విజయక్రాంతి): శ్రీరక్ష నీకు రక్షణ ఎవరూ......? అధికారుల......? లేక ప్రజాప్రతినిధులా......? ఇంత బరితెగించి నిర్మాణం చేస్తున్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనిపించడం లేదా...... మీరు ఇచ్చిన అమ్యమ్యాలకు  తలొ గ్గి అక్రమాలకే అండగా నిలబడ్డారా..... అనే అనుమానాన్ని వికారాబాద్ పట్టణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను కాలరాస్తూ శ్రీరక్ష కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ అంతస్తులు చకచక లేచిపోతున్నాయి.

ఈ విషయం సంబంధిత అధికారులకు తెలిసిన తమకేమీ తెలియనట్లు సుద్ధపూసల మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యుడు చిన్న తప్పిదంతో ఇంటి నిర్మాణం చేస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు భయబ్రాంతులకు గురి చేసే మున్సిపల్ అధికార్లు వారి కళ్లముందే నిబంధనలకు విరు ద్ధంగా నిర్మాణాలు చేస్తున్న ఎందుకు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నా యి. కేవలం రియల్టర్లు ఇచ్చే అమ్యమ్యాలకు ఆశపడి అటువైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

వికారాబాద్ మునిసిపల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 16 లో ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో శ్రీరక్ష కన్స్ట్రక్షన్ సంస్థ ఏడాది క్రితం అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే ఇట్టి నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఒక తీరుగా పొంది మరో తీరుగా నిర్మాణం చేస్తుండటమే వివాదాలకు దారితీస్తుంది. మున్సిపల్ భవన నిర్మాణం నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ నియమాలు, ఫైర్ సేఫ్టీ వంటి షరతులను పూర్తిగ గాలికి వదిలి కేవలం లాభార్జన దృష్టితోనే నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రధానంగా ఈ అపార్ట్మెంట్ నిర్మాణం ముందు ఉన్న 60 ఫీట్ల రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై కొందరు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మాణం ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ప్రజల రాకపోగాలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం లేకపోలేదు.

సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణం

2019 మున్సిపల్ యాక్టివ్ ప్రకారం అపార్ట్మెంట్ నిర్మాణంకు తీసుకున్న అనుమతుల ప్రకారం 60 ఫీట్ల రోడ్డు నుండి మూడు మీటర్ల సెట్ బ్యాక్ వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ శ్రీరక్ష కన్స్ట్రక్షన్స్ ఆ నిబంధనలను గాలికి వదిలి నిర్మాణం చేపడుతుంది. శ్రీ రక్షా కన్స్ట్రక్షన్స్ లో సెట్ బ్యాక్ అనే పదమే లేదన్నట్లుగా వ్యవహరిస్తుంది. పైగా ముందు ఉన్న 60 ఫీట్ల రోడ్డును ఆక్రమించి కడుతున్న అధికారులు స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనల ప్రకారం ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చుట్టూ ఫైర్ సేఫ్టీ కోసం సెట్ బ్యాక్ వదిలేయాలి. కానీ సంబంధిత సంస్థ ఆనిబంధనలను కాలరాశి నిర్మాణాలు చేపడుతుంది. ఇలా ఇష్టానుసారంగా నిర్మాణం చేస్తున్న అపార్ట్ మెంట్ భవిష్యత్తులో ముప్పు తప్పదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఎన్నడు తనిఖీలు చేసిన సందర్భాలు లేవు.

 అధికారుల తీరుపై విమర్శలు

గత మూడు సంవత్సరాలుగా వికారాబాద్ మునిసిపల్ పరిధిలో పదుల కొలది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఓ మున్సిపల్ అధికారి అక్రమ నిర్మాణాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఏడాదికాలంగా మున్సిపల్ పాలకవర్గం లేకపోవడం సదరు అధికారులకు  అవకాశంగా మారిందనే చెప్పవచ్చు . 

వికారాబాద్ మునిసిపల్ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండంతస్తుల నిర్మాణం వరకే పరిమితి ఉంది. కానీ ఈ రెండు ఏళ్లలో పట్టణంలోని ప్రధాన రోడ్లలో నాలుగు నుండి ఐదు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి కేవలం రెండంతస్తుల అనుమతులు మాత్రమే ఉండడం గమనార్హం.