29-12-2025 02:06:34 AM
నా బాత్రూమ్ నేనే కడుక్కుంటి.. నీకేంటి నొప్పి?
రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ మండిపాటు
త్వరలో పాలమూరు జిల్లాలో కేసీఆర్ బహిరంగ సభ
కందనూల్‌లో బీఆర్‌ఎస్ సర్పంచులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సన్మానం
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత పదేళ్ల పాటు రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని, ప్రస్తుతం రైతుబంధు పోయి కమీషన్లు, భూకబ్జాలు, సెటిల్మెంట్లతో రాబందుల రాజ్యం నడు స్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్‌ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులను సన్మానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేగులు తెగేలా కొట్లాడి చావు అంచుదాక పోరాడి రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణగా రూపుదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం బజారుపాలు చేసిందని మండిపడ్డారు. నాడు బీడు భూముల్లో సాగునీటిని పారించి వ్యవసాయం పండగలా చేయడంతో వలస లు వాపస్ వచ్చిన ప్రాంతం ప్రస్తుతం తిరిగి వలసలు పెరుగుతున్నాయని ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న కుట్రలో భాగంగానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాను పుణె, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నత చదువులు చదివి అమెరికా వెళ్లాను. ‘అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే నేను ఉంటున్న ఇంటిని శుభ్రం చేసుకున్నా.
నా బాత్రూం నేను శుభ్రం చేసుకుంటే రేవంత్‌రెడ్డికి నొప్పేంటో చెప్పాలి’ అన్నారు. బాత్రూం కడిగే వారు అంటూ శ్రమను అవమానపరిచే విధంగా మాట్లాడటం తగద న్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కూడా అమెరికాలోనే నివసిస్తున్నాడని, అతడు కూడా బాత్రూంలు కడిగినట్లేనా అని ప్రశ్నించారు. ఆంధ్రాలో చదువుకున్న వ్యక్తినని తనపై వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కూతురికి అల్లుడుని కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చుకున్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని, అందుకే సీఎం అయ్యావా అని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తానని శపథం చేయాలని, రైతులకు యూరియా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తానని హామీ ఇవ్వాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ప్రజల ముందే శపథం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం సొంత మండలంలో బీఆర్‌ఎస్ విజయం..
రెండేళ్లలోనే సీఎం నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని, సర్పంచి ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. సీఎం సొంత మండలంలో కూడా బీఆర్‌ఎస్ సర్పంచులే గెలిచారని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందాయని, వైకుంఠధామాలు, డంప్ యార్డులు నిర్మించామన్నారు. దేశంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయని గుర్తుచేశారు.
ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పడకేసిందని, ట్రాక్టర్లలో డీజిల్ లేదని, వీధిలైట్లు లేవని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించకపోవడం, రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
త్వరలో కేసీఆర్ బహిరంగ సభ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించిన కేటీఆర్.. పాలమూరు ప్రాజెక్టులు, సమస్యలపై మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు కేసీఆర్ హాజరవుతారని వెల్లడిస్తూ, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు నేతల మధ్య సయోధ్య కుదరక నిర్లక్ష్యమే ఓటమికి కారణమని అంగీకరించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడాలని సూచించారు. అన్ని ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ను మళ్లీ సీఎం చేయాలన్నదే లక్ష్యమన్నారు.
పార్టీని కించపరిస్తే అడ్రస్ లేని బతుకులే అంటూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై పరోక్ష విమర్శలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు శశిధర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బైకానీ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.