29-12-2025 02:18:15 AM
సాగునీటి రంగంపై సీఎం మేధోమథనం
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కృష్ణా నీటివాటాలో నష్టం జరిగిందని కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎట్టా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండ్ కో మేధోమథనం నిర్వహించినట్లు తెలిసింది. అందులో భాగంగానే కృష్ణా, గోదావరి నదీ జాల లు, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహిం చిన సమీక్షలో ఈ విషయాలపైనే చర్చించారని తెలుస్తోంది. అసెంబ్లీ సోమవారం నుంచి ప్రారంభం కానుండటం.. ఈ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాపైన చర్చ జరగనుంది.
ప్రజెంటేషన్‌పై ఫోకస్..
అంతే కాకుండా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల చేసిన ఖర్చు, కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వివాదాలు, బీఆర్‌ఎస్ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నట్లుగా తెలిసింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపైనా ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటి నుంచి పరిణామాలు, బీఆర్‌ఎస్ హయాంలో నిర్ణయాలు, పురోగతి, గత రెండేళ్లుగా పనులు, ఇలా అన్ని వివరాలు సీఎం తీసుకున్నారని సమాచారం.
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని..
కృష్ణా నీటి వాటాలో బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణకు 299 టీఎంసీలు నీరు మాత్రమే చాలని కేసీఆర్ సంతకం చేయడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే కృష్ణా నీటివాటాలో నష్టం జరిగిందని కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు చెస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, బీఆర్‌ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సిద్ధమవుతోంది.
అయితే సాగునీటి ప్రాజెక్టులపై జనవరి 1న ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవ్వనున్న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు, ఇరిగేషన్ నిపుణులు కూడా హాజరుకానున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించనున్నట్లు తెలుస్తోంది.