calender_icon.png 22 December, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ

22-12-2025 01:46:18 AM

  1. మహాలక్ష్ముల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు
  2. నిజామాబాద్, వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు
  3. రజక, నాయీ బ్రాహ్మణ కులవృత్తుల విద్యుత్ ఉచిత బిల్లులు విడుదల
  4. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లా భాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లులను చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం ప్రజాభవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఉప ముఖ ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆర్టీసీ బలోపేతం చేసేందుకు, కార్మి కులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలకమైన చర్యలను తీసుకుంటోందని అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లభాల్లోకి వచ్చిందన్నారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ సహకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి కూడా ప్రజాప్రభుత్వం చేయూత ఇస్తోందని చెప్పారు.

ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు సంస్థ స్వతహాగా నూతనంగా ఆదాయా మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెస్ తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలన్నారు. ఆర్టీసీలో పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వీటికి చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

పీఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ పంపిణీ చేయాలని అందుకు సంబధించిన నిధులు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియాను డిప్యూటీ సీఎం ఆదేశించారు. నాయీ బ్రాహ్మణ, రజకకుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు లేకుండా చూస్తూ నెల వారీగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోందని స్పష్టం చేశారు. అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని భట్టి విక్రమార్కను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అదేవిధంగా మార్చ్ 2026 వరకు 3,233 కండక్టర్ పోస్టులు అవసరం ఉండగా తాత్కాలికంగా నియామకాలు జరపడంతో పాటు 50 శాతం రెగ్యులర్ నియామకాలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

వాటితో పాటు చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు, డ్రైవింగ్ లైసెన్స్ ల జారీలో ఉన్న ఇబ్బందులు తేలెత్తకుండా యూజర్ ఛార్జీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచడానికి కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వాలని, ట్యాక్స్ కలెక్షన్ కోసం ట్యాబ్‌లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజేపీ కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు