19-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 18 (విజయక్రాంతి): మనిషి జీవితంలో వృత్తిని ఛాలెంజ్ తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధన చారి అన్నారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, కాచం ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాచం సత్యనారాయణ గుప్తా సారధ్యంలో నిర్వహిస్తున్న విశ్వంభర సంస్థ మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.
ఎంతోమంది వృత్తిని ఛాలెంజ్ తీసుకుని వివిధ రంగాలలో స్థిరపడి ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. వృత్తిని ఎంచుకునే మందు ఆ వృత్తిపట్ల ఉన్న అవగాహనను పరిగణలోకి తీసుకోవాలని అప్పుడే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా పత్రికలకు ఆదరణ తగ్గలేదని అన్నారు. ప్రజలు పత్రికలు చదివే విధంగా అన్ని ప్రాంతాలలో గ్రంథాలయాలు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వంభర సంస్థ ప్రతినిధులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.